ఇక ట్రోల్ చేసే వారిని వదలబోన్న రష్మిక
నవంబర్ 09 (ఆంధ్రపత్రిక): స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న చాలా రోజుల తర్వాత తన ఇన్ స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. కొన్ని రోజులు, నెలలు, ఇప్పుడు సంవత్సరాలుగా తనను ఇబ్బంది పెడుతున్న విషయాల గురించి రష్మిక మందన్న నోరు విప్పారు. తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి ఆమె ఈ పోస్టును రాశారు. ఇప్పటివరకు ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసిన భరించాను ఇకపై నాకు అంత ఓపిక లేదని చెప్పారు. కొందరు చేస్తున్న ట్రోల్స్ తనను నిరుత్సాహ పరిచే విధంగా ఉన్నాయని.. గుండె బద్దలు అయ్యేలా నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొందరు తనపై విషం చిమ్ముతున్నారని.. ఆవేదన చెందారు. ట్రోల్స్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్పెడ్ర్ చేసేవాళ్ళకు తానొక పంచింగ్ బ్యాగ్ కింద మారినట్టు ఆవిడ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తనను ఇష్టపడాలని తాను ఆశించడం లేదని, నటిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విమర్శలు వస్తాయనేది తనకు తెలుసని, దాని అర్థం ద్వేషించమని కాదని రష్మిక స్పష్టం చేశారు. తన అభిమానులను.. గర్వపడేలా చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు. కొందరు తాను చెప్పని విషయాలను కూడా చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారని.. తనను టార్గెట్ చూస్తూ సోషల్ విూడియాలో పోస్టులు పెడుతున్నారని అన్నారు. వాటిని చూసి తాను తట్టుకోలేక.. నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలిపారు. కొన్ని ఇంటర్వ్యూలలో తాను చెప్పిన విషయాలు తనకు వ్యతిరేకంగా మారాయన్నారు. సినిమా ఇండస్టీ బయట తన రిలేషన్షిప్స్కు హాని కలిగించే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని రష్మిక పేర్కొన్నారు. తనను మెరుగు పరుచుకునేలా వచ్చే విమర్శలను తాను స్వాగతిస్తానని తెలిపారు. చాలా రోజులుగా తాను విమర్శలను విస్మరిస్తూ వస్తున్నానని… అయితే రోజు రోజుకూ వరస్ట్ అవుతోందని రష్మిక వివరించారు. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమ, అభిమానం ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇస్తోందని ఆవిడ చెప్పారు. అభిమానుల్ని సంతోషపెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని.. ప్రతిఒక్కరూ దయతో ఉండండి అంటూ రష్మిక పోస్టు పెట్టారు