- భారత్-అమెరికా సంబంధాలపై చాలా ఆశాజనకంగా ఉన్నా: ఎస్.జైశంకర్
- గత నాలుగేళ్లుగా ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో పెనుమార్పులు వచ్చాయి
- అమెరికా మరింత దగ్గరైంది
- ఇతర దేశాలు దగ్గరయ్యేందుకు మార్గాలు తెరిచిన భారత్
- సంప్రదాయ పొత్తులకు అతీతంగా ఆలోచిస్తున్న భారత్
- అమెరికాతో కలిసి మరింతగా ముందుకు సాగుతాం
- భవిష్యత్తులో ఇలాంటి సందర్భాలు మరిన్ని వస్తాయి
- సంయుక్త విలేకర్ల సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్
- అమెరికాతో కలిసి ప్రపంచ దిశను మార్చేందుకు కలిసి పనిచేస్తున్నాం
న్యూఢల్లీి,సెప్టెంబరు 28 (ఆంధ్రపత్రిక): భారత్-అమెరికా సంబంధాలపై తాను చాలా ఆశాజనకంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడిరచారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల సంబంధాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘’మా రెండు దేశాల సంబంధాలపై నేను చాలా ఆశాజనకంగా ఉన్నాను. ఈ విషయాన్ని చాలా సూటిగా చెబుతున్నాను. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో పెనుమార్పులు వచ్చాయి. ఈ మార్గాన్ని నేను ఎలా చూస్తున్నాను అనేగా మీ ప్రశ్న..? నిజాయితీగా చెబుతున్నాను.. ప్రస్తుతం అమెరికా మరింత దగ్గరైంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలు దగ్గరయ్యేందుకు మార్గాలు తెరిచింది. సంప్రదాయ పొత్తులకు అతీతంగా ఆలోచిస్తోంది. భాగస్వాములతో సమర్థంగా పనిచేయగల వేదికలను చాలా బాగా సిద్ధం చేస్తోంది. క్వాడ్‌ను చూడండి.. గత రెండు దశాబ్దాలుగా పెద్దగా పనిచేయలేదు. కానీ, ఇప్పుడు చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. ముఖ్యంగా రెండేళ్ల నుంచి ఈ మార్పు కనిపిస్తోంది. అమెరికాతో కలిసి ప్రపంచ దిశను మార్చేందుకు కలిసి పనిచేస్తున్నాం. అమెరికాతో కలిసి మరింతగా ముందుకు సాగుతాం. భవిష్యత్తులో ఇలాంటి సందర్భాలు మరిన్ని వస్తాయి’’ అని పేర్కొన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ మాట్లాడుతూ ‘’ప్రపంచంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కావడంతో ఈ శతాబ్దపు దశ, దిశను మార్చేందుకు చాలా అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత విధంగా భారత్-అమెరికా కలిసి పనిచేస్తున్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. అలాగని మా మధ్య అభిప్రాయ భేదాలు లేవని కాదు.. ఉన్నాయి.. భవిష్యత్తులో కూడా ఉంటాయి. మా మధ్య లోతైన నాణ్యమైన బంధం ఉండటం వల్లే అది సాధ్యమైంది. మేము అన్ని అంశాలపై మాట్లాడతాం’’ అని వివరించారు.