భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, కీలక రంగాల్లో ఎగుమతులను పెంచడానికి ప్రత్యేక పథకాలను రూపొందిస్తోంది.
ఇందులో 14 కీలక రంగాలను కవర్ చేసే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్స్.. 2024 ఆగస్టు నాటికి రూ.1.46 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న సంవత్సరాల్లో మూలధన పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనాలు ఉన్నాయి.
PLI పథకాల ద్వారా లబ్ది పొందే కంపెనీలతో వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు. 1,300 పార్టిసిపేటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో 140 కంపెనీలతో ఆయన ఇటీవల సమావేశమై వాటి పురోగతిని చర్చించి, ఫీడ్‌బ్యాక్ సేకరించారు. మంత్రిత్వ శాఖ ప్రకారం, PLI పథకాలు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
– ఇప్పటి వరకు రూ.1.46 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, త్వరలో రూ.2 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.
– 12.50 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, అమ్మకాలు సాధించారు.
– ఈ పథకాలు దాదాపు 9.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి. ఈ సంఖ్య 12 లక్షలకు చేరుకుంటుందని అంచనా.
– ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల నుంచి ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు దాటాయి.
ఈ సమావేశంలో గోయల్ ‘బ్రాండ్ ఇండియా’ను ప్రోత్సహించగల అధిక-నాణ్యత వస్తువులను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమలను కోరారు. ఆయన సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అవసరాన్ని నొక్కి చెప్పారు, దేశంలోని ఉత్పత్తులకు మరింత వ్యాల్యూ జోడించాలని కంపెనీలను ప్రోత్సహించారు.
ప్రభుత్వ ప్రక్రియలకు సర్దుబాట్లు చేయడంతోపాటు కంపెనీలు తమ సూచనలను కూడా పంచుకున్నాయి. అధిక డొమెస్టిక్ వ్యాల్యూకి అవసరమైన ఎకోసిస్టమ్‌ని అభివృద్ధి చేయడానికి కొన్ని రంగాలు సమయం తీసుకుంటాయి. ఈ పరిశ్రమలకు సపోర్ట్ చేసే మార్గాలను అన్వేషించాలని గోయల్ అధికారులను ఆదేశించారు.
* ప్రభుత్వ నిబద్ధత
PLI-సంబంధిత పరిశ్రమలకు అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటి మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరిచేందుకు మద్దతునిస్తుందని మంత్రి గోయల్ హామీ ఇచ్చారు. ఈ రంగాల్లో ఉత్పత్తి అంచనాలను మించి ఉంటుందని, దేశీయంగా డిమాండ్‌తో పాటు ఎగుమతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశంలో మొదటిసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాటి కోసం కంపెనీలు కొన్ని మార్పులను సూచించాయి. గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన ముందస్తు ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్లను తీర్చడంలో సవాళ్లను ఎదుర్కొంటాయి. కొత్త, వినూత్న ఉత్పత్తుల కోసం, ముందస్తు అనుభవం లేకుండా సరఫరాకు అర్హతను నిర్ధారించడానికి ల్యాబ్ టెస్ట్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించవచ్చని గోయల్ సూచించారు.
* PLI పథకాల విజయం
1.97 లక్షల కోట్ల బడ్జెట్‌తో 2021లో ప్రవేశపెట్టిన PLI పథకాలు ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, వైట్ గూడ్స్, టెలికమ్యూనికేషన్స్, డ్రోన్ల సహా 14 రంగాలను కవర్ చేస్తాయి. ఈ పథకాలు ఇప్పటికే అనేక పరిశ్రమల్లో భారీగా వృద్ధిని నమోదు చేశాయి.
ఎలక్ట్రానిక్స్ రంగంలో, మొబైల్ ఫోన్ తయారీ ఇప్పుడు భారతదేశం మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో సగం వాటాను కలిగి ఉంది. 2020-21 నుంచి ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. ఆటోమొబైల్ రంగంలో, అనేక ప్రపంచ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టాయి.