రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం.
కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి
మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద
మీ హక్కుల కోసం పోరాటం చేయండి.. మీ ప్రాంతానికి న్యాయం చేయండి
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు
వైకాపా నేత సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
హైదరాబాద్,డిసెంబర్ 8 (ఆంధ్రపత్రిక): ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు ఏ అవకాశం దొరికినా తమ పార్టీ ఓటు వేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా స్పందించారు.సజ్జల వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండిరచారు. ‘’సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి. నేడు తెలంగాణ ఒక వాస్తవం. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు? మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు’’ అని షర్మిల ట్విటర్లో పేర్కొన్నారు.
సజ్జల ఏమన్నారంటే?
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ వైకాపా పోరాటం చేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే వైకాపా విధానమని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు ఏ అవకాశం దొరికినా మళ్లీ కలిసేందుకే తమ పార్టీ ఓటు వేస్తుందని చెప్పారు. అయితే విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినందున పెండిరగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపైనే తాము దృష్టిపెడుతున్నామన్నారు.‘’అప్పట్లో తెదేపా, కాంగ్రెస్, భాజపా రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించాయి. విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి వైకాపా పోరాటం చేసింది.. మళ్లీ ఉమ్మడి ఏపీ అయితే తొలుత స్వాగతించేది వైకాపానే. ఏపీ విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంకోర్టులో కేసు ఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదనలు బలంగా వినిపిస్తాం. విభజన జరిగిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు. ఉమ్మడి ఏపీ కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనే భావన ప్రజల్లో బలంగా ఉంది. మళ్లీ ఉమ్మడి ఏపీ కాగలిగే అవకాశముంటే ఆ విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్లేది వైకాపానే. ఏ వేదిక దొరికినా మళ్లీ కలిసేందుకే ఓటు వేస్తాం. విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తూనే ఉంటాం. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలి?’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.