తండ్రి నుంచి షర్మిలకు వచ్చిన వారసత్వ ఆస్తి ఎంత? ఆమెకు అదనంగా జగన్ ఇచ్చిన ఆస్తులెన్ని
ANDHRAPATRIKA : – జగన్, షర్మిల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాల వివాదం, షర్మిల లేఖలు రాయడం, NCLTని జగన్ ఆశ్రయించడం… వీటన్నింటి పైనా వైసీసీ నేత పేర్ని నాని స్పందించారు.
వారసత్వ ఆస్తి చట్టం ప్రకారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే జగన్‌కు షర్మిలకు ఆస్తి పంపకాలు జరిగిపోయాయంటున్నారు పేర్ని. ఆ తర్వాత తన స్వార్జితపు ఆస్తిలో కూడా చెల్లి షర్మిలకు జగన్ వాటా ఇచ్చారని లెక్కలతో సహా చెప్పారు వైసీపీ సీనియర్ నేత. అయితే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విషయంలో… షర్మిల మార్పులుచేర్పులు చేయడంతో వివాదం మొదలైందంటున్నారు వైసీపీ నేత పేర్ని నాని. అందుకే జగన్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు పేర్ని.
షర్మిలకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల వివరాలు, ఆ తర్వాత జగన్ నుంచి వచ్చిన ఆమెకు ఏమేం ఆస్తులు వచ్చాయో, ఏయే కంపెనీల్లో వాటాలు దక్కాయో పేర్ని వివరించారు. పేర్ని చెప్పిన లెక్కల ప్రకారం…వైఎస్ మరణానికి ముందే షర్మిలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో 280గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15మెగావాట్ల సండూర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టుల లైసెన్సులు, 22.5 మెగావాట్ల స్వాతి హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్ – యువరాజ్ థియేటర్లో 35 శాతం వాటా, పులివెందులలో మరో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వంద శాతం వాటాలు దక్కాయి.
ఆస్తులు కాకుండా భారతి సిమెంట్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మీడియా వ్యాపారసంస్థలన్నీ జగన్ స్వార్జితం అన్నారు పేర్ని నాని. షర్మిలపై జగన్‌కు ప్రేమ లేకుంటే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న తన ఆస్తులు, వ్యాపారాల్లో వాటాలను ఆమెకు జగన్ ఎలా రాసిస్తారని ప్రశ్నించారు పేర్ని నాని. షర్మిలకు పెళ్లయిన ఇన్నేళ్లకు, వైఎస్ చనిపోయిన దశాబ్దం తర్వాత, 2019లో తన స్వార్జితపు ఆస్తిలో వాటాలను షర్మిలకు రాసిచ్చారంటే జగన్‌కు ఆమె మీద ప్రేమ ఉన్నట్లా? లేనట్లా అన్నారు పేర్ని. తన తల్లిని చెల్లిని కూర్చోబెట్టి అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్లో వాళ్లకు వాటా ఇస్తానంటూ జగన్ అండర్స్టాండింగ్ రాసుకున్నారని పేర్ని వివరించారు.
ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించి ఏయే సంస్థల్లో షర్మిలకు ఎంత వాటా ఇస్తూ జగన్ ఎంవోయూ చేసుకున్నారో పేర్ని వివరించారు. భారతి సిమెంట్స్‌లో 40 శాతం, మీడియా సంస్థలో 40 శాతం, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో 100 శాతం వాటా ఇస్తానంటూ జగన్ ఒప్పందం రాశారన్నారు పేర్ని. ఈడీ అటాచ్మెంట్ అయిపోగానే తన చెల్లికి ఈ ఆస్తులన్నీ ఇస్తాను అని జగన్ రాశారని పేర్ని తెలిపారు.
కోర్టు కేసులు అయిపోయాక తల్లికి చెల్లికి ఈ ఆస్తులన్నీ ఇస్తానంటూ తెల్ల కాగితం మీద జగన్ తన అంగీకారం తెలిపారని, అది అన్ రిజిస్టర్డ్ అని తెలిపారు పేర్ని. షేర్ సర్టిఫికెట్లు పోయాయని చెప్పి కొత్త షేర్లను విజయలక్ష్మి పేరు మీద మార్చేసి డైరెక్టర్లను షర్మిల మార్చేయడంతోనే వివాదం మొదలైందన్నారు పేర్ని. చెల్లిపై జగన్‌కు ప్రేమ లేకపోతే ఆస్తులు రాసిస్తూ సంతకం ఎందుకు పెడతారని పేర్ని ప్రశ్నించారు.
షర్మిలకు తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల వివరాలు, తన స్వార్జితం నుంచి జగన్ ఇచ్చిన ఆస్తులు, కంపెనీల్లో వాటాల వివరాల లెక్కలు పూసగుచ్చినట్లు వివరించారు పేర్ని నాని.