- విజయవాడ,గుంటూరుల్లో కురుస్తున్న వానలు
- పలు జిల్లాల్లో జోరు వర్షాలతో నీట మునిగిన పంట
- రెండు రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు
అమరావతి,అక్టోబర్6(ఆంధ్రపత్రిక): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎపిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర విూదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… ఈ ఉపరితల ఆవర్తనం 3.1 కిలోవిూటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది. ఉదయం నుంచి విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది. బెంజ్ సర్కిల్, సింగ్ నగర్, పాయకాపురం.. మొగల్రాజపురం, లబ్బీపేట, ఆటోనగర్ ప్రాంతాలన్నీ వర్షానికి జలమయమయ్యాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడిరచింది. అల్పపీడన ప్రభావంతో గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో బుదవారం ఉదయం 9 గంటల నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుంటూరులోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు, వాహన దారులు అవస్థలు పడుతున్నారు. రహదారుల పై జనసంచారం తగ్గిపోయింది. భారీ వర్షంతో వ్యాపారులు కొనుగోలు చేసే వారు లేక నిరాశకు లోనయ్యారు. తెనాలి, మంగళగిరి, తాడికొండ, పత్తిపాడు తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. రహదారుల పక్కన నిర్వహించే వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారె డ్డిగూడెం కొంగవారిగూడెం ఎర్రకాల్వ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతున్నది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 విూటర్లు కాగా ప్రస్తుతం 82.40 విూటర్ల చేరుకున్నది. ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం`8165 క్యూసెక్కుల నీరు చేరింది. మధ్యాహ్ననికి జలాశయంలోనికి మరింత ఎక్కువ నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తి 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇలాగే వరద పెరిగితే మధ్యాహ్నం నుంచి మరో 1500 క్యూసెక్కుల వదిలే అవకాశం ఉందన్నారు. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. కొనకనమిట్ల మండలం పాతపాడు, నాగంపల్లి, నాయుడిపేట గ్రామలలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అధికారులు, నాయకులు డ్రైనేజి వ్యవస్థపై ద్రుష్టి సారించలేదని పలు గ్రామస్తుల ఆరోపణలు చేస్తున్నారు. ఈ భారీ వర్షానికి ఇళ్లల్లో వర్షపు నీరు చేరడంతో ఎక్కడ ఉండాలని అధికారులను, నాయకులపై పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అనంత జిల్లా రాప్తాడు మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామంలో ద్రాక్ష పంట, ద్రాక్ష పందిరి అధిక వర్షాలకు నేలమట్టం అయినాయి. దాదాపు 15 లక్షల నష్టం వాటిల్లిందని రైతు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ చదివిన గంగరాజు వ్యవసాయంపై మక్కువతో ద్రాక్ష తోటను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 30 టన్నులు ద్రాక్ష వర్షం దెబ్బకు తడిసిపోయింది. పందిరి పూర్తిగా నెలమట్టమయింది. అధిక వర్షాల వలన పంటలు దెబ్బతిన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. రాప్తాడు మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నేల కూలిన పంటలను పరిశీలించారు. ఈ క్రమంలో గంగరాజు అనే యువ రైతుకు చెందిన 2 ఎకరాలు ద్రాక్ష పంటను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతు పడే ఆవేదనను బాధను మాటల్లో చెప్పలేమన్నారు. దాదాపు 30 టన్నుల వరకు ద్రాక్ష పంట దెబ్బతింది. 15 లక్షల నష్టం వాటిల్లిందని అని తెలియజేశారు. ఇంజనీరింగ్ చదివిన గంగరాజు వ్యవసాయంపై మక్కువతో ద్రాక్ష తోటను ఏర్పాటు చేసుకున్నారు.ప్రభుత్వ అధికారులు పంట నష్టం అంచనా నివేదికలు త్వరగా ఉన్నతాధికారులకు పంపించి రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల అధ్యక్షులు పోతలయ్య ఆదినారాయణ రెడ్డి నూరుల్లా రైతులు పాల్గొన్నారు.