హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్,అక్టోబర్13(ఆంధ్రపత్రిక): రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పలుజిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 14న మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.15న వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు.. మూడు రోజులు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్‌తో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం నమోదైంది.