అతడే ఒక సైన్యం..!
జిల్లా విద్యాశాఖలో అతనే కీలకం.
అతను చెప్పిందే వేదం. గీసిందే గీత.
ఇకనైనా పద్ధతి మారుతుందా?
మచిలీపట్నం అక్టోబర్ 25 ఆంధ్ర పత్రిక : –
విద్యా రాజ్యంలో మకుటం లేని మహారాజు ఆ , ఏ, డి. అతను చెప్పిందే వేదం. అతను గీసిందే గీత. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వరు ! అన్న చందంగా అతని అనుగ్రహం లేనిదే ఏ ఫైలు కదలదని వినికిడి.
జిల్లా విద్యాశాఖ అధికారి తన కార్యాలయం మీద పట్టు, అజమాయిషి, సిబ్బంది పనితీరు పై పూర్తి అవగాహన కల్గి ఉండాలి. అలా లేకపోతే ఏ. డి.దే ఇష్టారాజ్యం అవుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
గుమస్తా గిరి నుండి గెజిటెడ్ అధికారి వరకు ఆ అధికారి సింహభాగం కృష్ణా జిల్లాలోనే పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు వేరే జిల్లాలలో పనిచేసినా,అదీ నామ మాత్రమే. కృష్ణాజిల్లా అంటే భోగభాగ్యాలతో నిండిన జిల్లా అని ప్రతీతి. అందుకే ఈ జిల్లా అంటే ఆయనకు మక్కువ అని ఉపాధ్యాయులు అనుకుంటున్నారు. సర్వీసులో అగ్ర భాగం ఈ జిల్లాలోనే నిర్వహించడం ఆయనకే చెల్లింది. ప్రభుత్వాలు మారినా వారి పరపతి మాత్రం తగ్గలేదు.
నూతన డి ఈ ఓ కార్యాలయ ప్రక్షాళన చేస్తారా?
గతంలో డీ ఈ వో లుగా పనిచేసిన వాళ్లలో సుదర్శన్ రావు లాంటి కొందరు అధికారులు తమదైన శైలిలో కార్యాలయ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి భళా అనిపించుకున్నారు.
నేడో, రేపో, కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిగా నెల్లూరు జిల్లా నుండి బదిలీపై పీ వీ జే రామారావు విచ్చేస్తున్నారు. వారు డీ ఈ వో గా బాధ్యతలు చేపట్టే నాటికి కార్యాలయంలో అనేక సమస్యలు తిష్ట వేసుకొని కూర్చున్నాయి. వీరు కార్యాలయంలో పట్టు సాధించడానికి కనీసం పది, పదిహేను రోజులు సమయం పడుతుంది. ఈలోపు ఎవరెవరు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు? ఎవరెవరు అంతా తామై వ్యవహరిస్తున్నారు? అనే విషయాలపై సమగ్ర అవగాహన కలిగి చాకచక్యంగా వ్యవహరిస్తే డిఇఓ కార్యాలయ ప్రక్షాళన జరిగి తీరుతుంది. నూతనంగా విచ్చేసే డి ఈ ఓ పాలనలో కొత్త సంస్కరణలకు తెర తీయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
గాడి తప్పిన పరిపాలన :
కృష్ణా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పరిపాలన గాడి తప్పిందని విమర్శలు గుప్పు మంటున్నాయి. దీనికి ప్రధాన కారణం జిల్లా ముఖ్య కేంద్రంలో సంబంధిత అధికారులు లేకపోవడమే.
రాబోయే డీఈఓ అయినా కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోనే మఖాం పెడతారని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా పనిచేసిన డీఈవో విజయవాడ నుండి మచిలీపట్నంలోని తన కార్యాలయానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే వారానికి రెండుసార్లు డీఈఓ కార్యాలయానికి రావడం వల్ల పరిపాలన మొత్తం ఏ. డి. 1 చేతిలోకి వెళ్లిపోయింది. ఇక అప్పటినుండి నేనే నెంబర్ వన్ అనే రీతిలో ఆయన పరిపాలన సాగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ. డి. 1 కూడా విజయవాడ నుండి ప్రతిరోజు డీఈఓ కార్యాలయానికి రావడం గమనార్హం. ప్రతిరోజూ వచ్చినా మమ అన్నట్లుగా మధ్యాహ్నం 11:30 తర్వాత వారు వచ్చి, సాయంత్రం అవ్వగానే కార్యాలయ పనులన్నీ చక్కబెట్టుకుని వెళ్తారని వినికిడి.
నూతన డిఇఓ అయినా కార్యాలయ ప్రక్షాళన చేస్తారా?
సంవత్సరాల తరబడి పాఠశాలలకు వెళ్లకుండా, డీఈవో కార్యాలయంలో ఫారిన్ సర్వీస్, డేప్యుటేషన్లు అనే రకరకాల పేర్లతో కొంతమంది ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం, ఉపవిద్యా శాఖ అధికారి కార్యాలయం, సమగ్ర శిక్ష తదితర కార్యాలయములలో అనధికారికంగా కొనసాగుతున్నారని భోగాట్టా. మొట్టమొదటగా అనధికార డిప్యూటేషన్లు, ఫారిన్ సర్వీసులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని బడిబాట పట్టించాలని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా బోధన కుంటుపడుతోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
డీఈఓ వరం ఇచ్చినా, ఏ డి వరం పొంది తీరాలి, అనే పద్ధతికి స్వస్తి పలకాలని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఏ డి గా కొనసాగుతున్న అధికారి ఇదే డి ఈ ఓ కార్యాలయంలో గుమస్తా నుండి ఏడి వరకు ఎదిగారు. అంతవరకు బాగానే ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో వీరు పక్క జిల్లాకు బదిలీపై వెళ్లినా సంవత్సరం తిరిగే నాటికి మళ్ళీ కృష్ణాజిల్లా డి ఈ ఓ కార్యాలయంలో ఏ.డి. గా కొలువు తీరడం విడ్డూరంగా ఉందని ఉపాధ్యాయులు గుసగుసలాడుతున్నారు. వివిధ హోదాల్లో ఇక్కడే పనిచేసిన వ్యక్తిని గెజిటెడ్ అధికారిగా (ఏ. డి.) మళ్లీ ఇక్కడే నియమించకూడదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. దానివల్ల పరిపాలన పట్టు తప్పి యావత్ పాలన ఏ.డి.చేతి లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. తద్వారా డి. ఈ.ఓ కార్యాలయంలో కోటరీ వ్యవస్థ నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తన మనుషులను కోటరీగా ఏర్పాటు చేసుకున్న ఏ డి ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు, సర్వీస్ మేటర్లు, సస్పెన్షన్లు ఎత్తివేయడం, మెడికల్ బిల్లులు, పాఠశాలలకు గుర్తింపు ఇవ్వడం, రెన్యువల్ చేయడం లో తెర వెనుక తనదైన శైలిలో చక్రం తిప్పుతారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. డీఈవో దగ్గరుండి పరిశీలించాల్సిన అంశాలలో వీరిదే ఆధిపత్యం ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత డీఈవో మానిటరింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, కార్యాలయంలో పరిపాలన గాడి తప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక్క ఏ.డి ఇద్దరు సూపరింటెండెంట్ లతో మాత్రమే
డి ఇ ఓ కార్యాలయ కార్యకలాపాలు వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.దానికి తోడు వీరు కూడా సంవత్సరాల తరబడి ఇదే కార్యాలయంలో బదిలీ లేకుండా పనిచేస్తుండడం వల్ల పాలన గాడి తప్పిందని అనుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇలాంటి అధికారుల తీరుతె న్నులు మారడం లేదని, ఎక్కడ తాళం అక్కడ! ఎక్కడ భజన అక్కడ చేసే వాళ్ళకే సునాయాసంగా పనులు జరిగిపోతున్నాయని వాపోతున్నారు.
ఏ.డి 2 గా మరో అధికారి ఉన్నా, వారి విధులు నామ మాత్రమే అని చెప్పవచ్చు. వీరికి ప్రాధాన్యత కలిగిన ఏ విధమైన పనులు కల్పించడం లేదని వినికిడి.
సిటిజన్ చార్ట్ ప్రకారం డి ఈ ఓ కార్యాలయానికి వచ్చిన అన్ని రకాల ఫైల్స్ కార్యాలయం నుండి పరిష్కరించి 15 రోజుల్లోపు సంబంధిత అప్పీలుదారులకు తిరిగి పంపాలి. డీఈఓ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ అమలుపరచడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఏ. డి. 1 అనుమతి లేనిదే ఏ ఫైలు కదలదని, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు .
సర్వం తానై డీఈఓ ను మించి ఏడి వ్యవహరించడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఇకనుండయినా నూతన డిఇఓ ఆధిపత్య పద్ధతికి వీడ్కోలు పలుకుతారని, తన దైన శైలిలో పాలన గాడిలో పెడతారని ఉపాధ్యాయ లోకం ఎదురుచూస్తోంది.
సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న డీఈఓ కార్యాలయాన్ని నూతనంగా విచ్చేస్తున్న డి ఈ ఓ పూర్తి ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా నూతన డిఇఓ పి.వి.జే. రామారావు కృషి చేస్తారని, పరిపాలనలో నూతన సంస్కరణలు తీసుకువస్తారని డీఈఓ కార్యాలయ ప్రక్షాళన చేసి, దశ, దిశ, మారుస్తారని ఆశిద్దాం..