Etela Rajender: గడప గడపకు రాజేందర్. యస్. మీ ఇంటికి వస్తా. మీ గడప తొక్కుతా. భోజనం చేసి వెళతా. ముద్దతో పాటు మాటాముచ్చట కలుపుతా అంటున్నారు ఆ సీనియర్ నేత. చర్చల మంత్రాంగం…భేటీల యంత్రాంగం. ఇదే నా స్టైల్, నా వ్యూహం అంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత జోష్ తగ్గిన తెలంగాణ బీజేపీలో సరికొత్త జోష్ నింపుతున్నారు. విడివిడిగా సమావేశాలు..కలివిడిగా మాటామంతీ అంటున్నారు. ఇంతకీ బీజేపీలో అసమ్మతికి ఆయన ఈటె దింపగలరా?
తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈటల రాజేందర్లో ఇంతకుముందు లేని జోష్ కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే గతంలో బండి సంజయ్ చేసిన తప్పులను చేయకూడదని ఆయన భావిస్తున్నారట. దానికోసం తనదైన శైలిలో రాజకీయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈటల రాజేందర్ చేస్తున్న రాజకీయంపై ఇప్పుడు బిజెపిలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్‌పై ఈటల ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టీ బీజేపీ నేతలంతా సమన్వయంతో పని చేసేలా చూడడం ఇప్పుడు ఈటల ముందున్న పెద్ద సవాల్ అంటున్నారు. దానికి తనదైన శైలిలో ఎదుర్కొనేందుకు ఈటల సిద్ధమై ముందుకు సాగుతున్నారట. కొంతమంది బండి సంజయ్ సన్నిహితులతో ఈటల రాజేందర్ విడివిడిగా భేటీ అవుతున్నారని సమాచారం.
ఈ పదవి రాకముందే జితేందర్ రెడ్డితో వివాదాలకు పుల్ స్టాప్ చెప్పి ఆయన ఫామ్ హౌస్ కు భోజనానికి వెళ్లారు ఈటల. ఆ తర్వాత గరికపాటి మోహన్ రావు, వికారాబాద్ చంద్రశేఖర్ ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి వచ్చారు… కలిసి పని చేద్దాం అంటూ వారిని ఈటల కోరారు. రానున్న రోజుల్లో మరికొంతమంది నాయకులతో ఈటల భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా బండి సంజయ్ వర్గానికి చెందిన నేతలను కలుపుకుని పోయే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది అవసరమైతే బండి సంజయ్ ఇంటికి కూడా వెళ్లి మాట్లాడాలని ఈటల అనుకుంటున్నారని బీజేపీలో చర్చ జరుగుతుంది.
మొత్తంగా ఇంటర్నల్ ఇష్యూస్ తో సతమతమవుతున్న రాష్ట్ర బీజేపీని మళ్లీ ఎన్నికల మోడ్ లోకి తీసుకెళ్లేలా ఈటల చర్చల మంత్రాంగం పనిచేస్తుందా? ఆయన వరుస భేటీల యంత్రాంగంతో అసంతృప్తులకు అడ్డుకట్ట పడుతుందా?