BJP Manifesto for Haryana : హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో హర్యానా ప్రజలకు 20 వాగ్దానాలతో కూడిన మ్యానిఫెస్టోను గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విడుదల చేశారు.
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పంట నష్టపరిహారం కంటే బీజేపీ ప్రభుత్వం పది రెట్లు అధికంగా అందించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రూ.1,158 కోట్ల పంట నష్టపరిహారం అందజేస్తే.. బీజేపీ హయాంలో రూ. 12,500 కోట్ల పంట నష్టపరిహారం రైతులకు అందించడం జరిగిందన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేర్చుతుందని నడ్డా తెలిపారు.
బీజేపీ మ్యానిఫెస్టోలో.. మహిళలకు ప్రతినెలా రూ. 2,100, ప్రతి నగరంలో 50వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. 24 పంటలకు కనీస మద్దతు ధర, రెండు లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్, అన్ని ఆస్పత్రుల్లో ఉచిత రోగ నిర్దారణ. హర్యానాలోని ప్రతి అగ్నివీర్ కు ప్రభుత్వ ఉద్యోగ గ్యారెంటీ. వెనుకబడిన 36 కులాల కోసం బడ్జెట్ తో ప్రత్యేక సంక్షేమ బోర్డులు, ముద్రా యోజనతో పాటు OBC కేటగిరీ వ్యవస్థాపకులందరికీ రూ. 25 లక్షల వరకు రుణాలతోపాటు మొత్తం 20 హామీలతో హర్యానా ఎన్నికల కోసం బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీ, రాష్ట్ర ఇన్ఛార్జ్ సతీష్ పూనియా, రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రిజల్యూషన్ లెటర్ కమిటీ చైర్మన్ ఓంప్రకాష్ ధంఖర్ తదితరులు పాల్గొన్నారు.