పెద్దపల్లి: వేల మొక్కలు పెంచాలంటే పెద్ద స్థలం ఉండాలనుకుంటాం.. కానీ 240 గజాల స్థలంలో నిర్మించిన 1800 చదరపు అడుగుల ఇంటినే తన అభిరుచి మేరకు పూదోటగా మార్చుకున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ అతీక్.
నడవడానికి దారి వదిలి.. మిగతా స్థలం అంతా కుండీలు పెట్టి వేల మొక్కలు పెంచుతున్నారు. పూలు, ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాల మొక్కలు, జామ, మామిడి, సపోట తదితర పండ్ల మొక్కలు.. ద్రాక్ష, డ్రాగన్‌ఫ్రూట్ వంటి తీగజాతి మొక్కలను పెంచుతున్నారు.
కూరగాయలూ సాగు చేస్తున్నారు. దఫదఫాలుగా దాదాపు 3 వేల కుండీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నట్లు అతీక్ తెలిపారు. ఇందుకోసం రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ పచ్చదనం కారణంగా మండుటెండల్లోనూ ఏసీ అవసరం లేకుండా ఇల్లు చల్లగా ఉంటుందన్నారు.