Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?
హనుమాన్ జయంతి (Hanuman Jayanti)ని పురస్కరించుకుని.. సినిమాలోని హనుమంతుని పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఆదిపురుష్’లో హనుమంతుడిగా
Adipurush Hanuman Poster
ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Krithi Sanon) జంటగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16న విడుదల కాబోతోంది. రీసెంట్గా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలను రివీల్ చేసేలా ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్‌పై కూడా బీభత్సంగా ట్రోలింగ్ నడిచింది. అంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన టీజర్‌పై కూడా దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఒక యానిమేషన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుందా? అంటూ.. ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓం రౌత్ (OmRaut)పై విరుచుకుపడ్డారు. దాంతో ఓంరౌత్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీనికోసం ఆయన భారీగానే ఖర్చుకు సిద్ధమయ్యారు. అయినా కూడా.. ఈ సినిమా విషయంలో ఏం మార్పు కనిపించడం లేదు.
తాజాగా హనుమాన్ జయంతి (Hanuman Jayanti)ని పురస్కరించుకుని.. సినిమాలోని హనుమంతుని పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఆదిపురుష్’లో హనుమంతుడిగా దేవదత్త నాగే (Devdatta Nage) నటించారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ అన్నింటిలో కెల్లా.. ఈ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకుంటుండటం విశేషం. హనుమంతుడు తన మనస్సులో శ్రీరామ అని తలచుకుంటూ.. తపస్సు చేస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. హనుమంతుని బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీరామ (SriRama) పాత్రదారి అయిన ప్రభాస్ (Prabhas) కనిపిస్తున్నారు. ‘రాముడి భక్తుడు.. రామ కథకి ప్రాణం.. జై పవనపుత్ర హనుమాన్’ అంటూ.. కొండను సైతం ఎత్తగల బలం ఉన్న హనుమంతుడి పాత్ర స్వరూపాన్ని పక్కాగా ఈ పోస్టర్లో చూపించారు. కండలు తిరిగిన శరీరంతో ఉన్న ఈ హనుమంతుడి పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ 2023లో మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతోన్న ఆదిపురుష్‌లో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ (Sunny Singh) లక్ష్మణుడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) రావణుడి పాత్రలో కనిపించనున్నారు. చెడుపై గెలిచిన మంచిని చూపిస్తూ.. ఆధునిక కాలానికి అన్వయించి రాబోతోన్న ఈ చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్లు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.