సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ హన్సిక గత ఎడాది ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియా(Sohail Kathuria)తో హన్సిక ఏడడుగులు వేసింది. వీరిది ప్రేమ వివాహం. అయితే హన్సికకు ఇది మొదటి వివాహం కాగా.. సోహైల్‌కు మాత్రం ఇది రెండోది. గతంలో హన్సిక ఫ్రెండ్ రింకీ బజాజ్‌ను సొహైల్ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి హన్సిక కూడా హాజరు అయింది.
అయితే పెళ్లి జరిగిన కొద్ది నెలలకే మనస్ఫర్థలతో ఆమె నుంచి సోహైల్ విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత హన్సిక, సోహైల్ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో హన్సిక, సోహైల్ వివాహం మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగింది. ఇకపోతే వీరి పెళ్లి వేడుకలను `లవ్ షాది డ్రామా`(love shaadi drama) పేరుతో ప్రముఖ ఓటీటీ దిగజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు గత రెండు వారాల నుంచి ప్రసారం చేస్తున్నారు.
తాజాగా మరో ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఇందులో పెళ్లికి ముందు హన్సిక ఫ్యామిలీతో జరిగిన అమ్మవారి పూజ కార్యక్రమం, వెడ్డింగ్ డ్రెస్(Wedding Dress) షాపింగ్ వంటివి చూపించారు. అలాగే కన్యాదానం విషయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని హన్సిక తల్లి మోనా వివరించారు. అసలేం జరిగిందంటే పెళ్లిలో హన్సికను కన్యాదానం చేయడానికి ఆమె తల్లి ఒప్పుకోలేదట. ఇదే విషయాన్ని ఆమె తల్లి తాజా ఎపిసోడ్లో వివరించింది.
`కుటుంబంలో అందరికంటే నువ్వే నాకు ఎక్కువ. ప్రతి అమ్మాయికి ఆత్మగౌరవం ఎంతో ముఖ్యం. నీవల్లే అది నాకు మరింత పెరిగింది. పెళ్లిలో నేను కన్యాదానం చేయకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే మరొకరికి దానం చేయడానికి నువ్వేమీ వస్తువు కాదు. కన్యాదానానికి బదులుగా గోదానం చేస్తాను. అలాగే పెళ్లి అయినా సరే నువ్వు ఎప్పటికీ నా ఇంటికి కూతురువే` అని తల్లి చెప్పడంతో హన్సిక(Hansika) ఏడ్చేసింది. తన తల్లి తీసుకున్న నిర్ణయం తనకెంతో నచ్చిందని, గొప్పగా ఉందని హన్సిక భావోద్వేగానికి గురైంది. ఇక కన్యాదానం విషయంలో హన్సిక తల్లి తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది సమర్థిస్తున్నారు.