తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి ఉత్సవరులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6 గంటల నుంచి పుష్పపల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరిండెంట్ శ్రీ మధు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 7 నుండి 7.45 గంటల వరకు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు ఆస్థానం జరిపారు.
శ్రీ కోదండరామాలయంలో :
తిరుపతి శ్రీ కోదండరామాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వార్లు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో :
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి , ఏఈఓ శ్రీ గురుమూర్తి, సూపరిండెంట్లు శ్రీ వెంకట స్వామి, శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇనస్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.