ఏపీలో వాలంటీర్ల సర్వీసు పొడిగింపు పై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల అంశం పైన చర్చ జరిగింది.
వాలంటీర్ల సర్వీసును పొడిగించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. అదే సమయంలో వార్డు సచివాలయాల్లోని కొన్ని విభాగాలను ప్రభుత్వ శాఖల్లో విలీనం దిశగానే కసరత్తు జరుగుతోంది. అసలు వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
వాలంటీర్ల సేవలపై
వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని..వారి వేతనాలు రూ 10 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత మూడు నెలలుగా వారి వేతనాలు లేవు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2023 ఆగస్టు15 నుంచి 2024 ఆగస్టు 15 వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను పొడిగించాలనే ప్రతిపాదనను మంత్రిమండలి తిరస్కరించింది. వాలంటీరు వ్యవస్థ, సచివాలయాలు, ప్రభుత్వ శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ అమలు పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఎం తాజా ఆదేశాలు
ఈ నివేదిక అందిన తరువాత తగు నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రభుత్వం వాలంటీర్ల మీదనే నడుస్తుందనే విధంగా వైసీపీ నేతలు ప్రచారం చేసారని…పార్టీ కార్యకర్తల కంటే వాలంటీర్లే మెరుగైన సేవలు అందిస్తున్నారనేలా నాటి ప్రభుత్వం వ్యవహరించిందని మంత్రివర్గ సమావేశం లో అభిప్రాయపడ్డారు. 2022 ఆగస్టు 15తో ముగిసిన సర్వీసును పొడిగించలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వారు ఇప్పుడు సర్వీసులో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పాలసీ తీసుకురావలనేది ప్రభుత్వ కొత్త ఆలోచన.
ఇక కష్టమేనా
ప్రభుత్వం ఈ పాలసీ అంశం తేల్చే వరకు వాలంటీర్లకు వేతనాలు ఉంటాయా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే రాజీనామా చేసిన వాలంటీర్ల కు తిరిగి అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న వారి విషయంలోనూ నిర్ణయం ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించటం లేదు. అదే సమయం లో సచివాలయాల్లోనూ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. కొందరు ఉద్యోగులను పంచాయితీ రాజ్ శాఖలో విలీనం చేసే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో వాలంటీర్ల పైన నిర్ణయం ఉంటుందని అంచనా వేసారు. అయితే..ఇప్పుడు ప్రభుత్వ తాజా ఆలోచనతో వాలంటీర్ల భవితవ్యం డైలమాలో పడింది.