రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్
విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రపత్రిక) : నిర్ణీత సమయంలో పన్నులు చెల్లింపు చేస్తున్న వ్యాపారస్తులు , పారిశ్రామిక వేత్తలు దేశ రక్షణకు పాటు పడుతున్న జవాన్ లతో సమానమని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఉడా చిల్డ్రన్ ధియేటర్ నందు వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, వాణిజ్య సంఘ సభ్యులు మరియు ఛార్టెడ్ అకౌంటెంట్లతో ఏర్పాటు చేసిన ట్రేడ్ అడ్వయిజరీ కమిటి సమావేశంనకు ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనకు రెవెన్యూ ముఖ్య కారణమని, వ్యాపారస్తులు నిర్ణీత సమయంలో ఎవరైతే పన్ను కడుతున్నారో వారే నిజమైన దేశ భక్తులని అన్నారు. పన్ను చెల్లింపు దారులు మరియు పన్ను జమచేయు శాఖల అధికారులు సమన్వయంతో చర్చించేందుకు ట్రేడ్ అడ్వయిజరీ కమిటి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటి ప్రతి మూడు నెలలకు ఒక సారి సమావేశమై వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులను, సూచనలను తీసుకోవడం జరుగుతుందన్నారు. వాణిజ్య పనుల శాఖలో పాలనా పరమైన నిర్ణయాల అమలకు నూతన వరవడిని తీసుకు రావడం జరిగిందన్నారు. పరిశ్రమలు స్థాపించే వారికి నైపుణ్యంతో కూడిన సిబ్బందిని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ పైనాన్స్ ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ, రెవెన్యూ రాబడి, రెవెన్యూ వసూలు చేయు విధానం మరియు ఖర్చు చేయు విధానం తదితర అంశాలపై ప్రభుత్వ పరిపాలన ఆధారపడి ఉంటుందన్నారు. టాక్స్ చెల్లిస్తూ ప్రభుత్వ పాలనకు సహకరించే పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండకూడదని , వ్యాపారానికి అనుకూల పరిస్థితులు కల్పించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి.సత్యన్నారాయణ, శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, పి.రవీంద్రబాబు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర, వాణిజ్య పనుల శాఖ చీఫ్ కమిషనర్ ఎం .గిరిజా శంకర్, కమిషనర్ కె.రవిశంకర్, పైనాన్స్ సెక్రటరీ కె.వి.వి.సత్యన్నారాయణ, జాయింట్ కమిషనర్ విశాఖపట్నం డివిజన్ – 1 డాక్టర్ బి.నాగార్జునరావు, డివిజన్ – 2 ఎం .సుధాకర్ రావు, సిబ్బంది, వివిద వ్యాపార సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.