ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులు పెంచి మాతా శిశు మరణాలు తగ్గించాలి..!
కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు..!
మచిలీపట్నం, ఆగష్టు 16, ఆంధ్ర పత్రిక…! జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కేసులను పెంచాలని,మాతా శిశు మరణాలను తగ్గించేందుకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వైద్యాధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఆరోగ్యశ్రీ సేవలు, మాతా శిశు మరణాలు, తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరగాలన్నారు. వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. గర్భవతులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మాతా శిశు మరణాలు జరగకుండా నివారణ చర్యలు గట్టిగా చేపట్టాలన్నారు.
ఆరోగ్యశ్రీ వివరాలను సంబంధిత యాప్లో నమోదు చేసేందుకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకొనుటకు కావలసిన నిధులు సమకూరుస్తామని ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ సేవలు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, సర్వజన ఆస్పత్రులలోని వైద్యులు సమన్వయంతో పనిచేసి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలన్నారు.
జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులు ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం కాలేదని వెంటనే వారి పేర్లు వివరాలను నమోదు చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు లేదని తిరస్కరించరాదని స్పష్టం చేస్తూ వారికి తెల్ల రేషన్ కార్డు ఉన్న యెడల నిర్లక్ష్యం చేయక తప్పనిసరిగా వారి ప్రసవానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నైపుణ్యం గల వైద్యులు ఉన్నారన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్ సి) పరిధిలో సాధారణ ప్రసవాలు తప్పనిసరిగా చేయాలని, హైరిస్కు కేసులను మాత్రమే సామాజిక ఆరోగ్య కేంద్రాలకు (పి హెచ్ సి) రిఫర్ చేసి పంపాలన్నారు.
అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో కూడా ప్రసవాలు జరగాలని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, అవసరమైన పరికరాలు లేనప్పుడు మాత్రమే సర్వజన ఆసుపత్రికి పంపించాలన్నారు.
గర్భవతైన మూడు నెలలు తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు హైరిస్క అనేది గుర్తించి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులతో సంప్రదించాలన్నారు.
ప్రతి గర్భవతి ఎక్కడ ఎప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నదో వాటి వివరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ప్రసవం అయ్యేంతవరకు, ఆ తర్వాత కూడా గర్భిణీ స్త్రీలు, శిశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు.
గర్భవతులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం సజావుగా జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వైద్యుల్లో కూడా మార్పు రావాలని, గర్భవతులతో ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, ఆసుపత్రుల పరిసరాలు,గదులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా, హై జనిక్ గా ఉంచుకోవాలన్నారు.
ఆరోగ్యశ్రీ కార్డుదారులు అంటే చిన్నచూపు చూడకుండా, వారికి చేసే చికిత్సలు, వైద్య సేవలు వలన ఆరోగ్యశ్రీ పథకం కింద ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.
ప్రసవాలకు సంబంధించి ఫోన్ చేసినప్పుడు 108 వాహనాలు వీలైనంత తొందరగా వచ్చేటట్లు చూడాలన్నారు.
ఈ సమావేశంలో డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ ఇందిరా దేవి, మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య పర్యవేక్షకులు డాక్టర్ రమేష్ కుమార్ పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.