వృద్ధుల పెన్షన్ రూ. 2750కి పెంపు
- ప్రతి నెలా రూ.130.44 కోట్ల అదనపు వ్యయం.
- రూ. 23 వేల కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు ఆమోద ముద్ర
- మరొకవైపు వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
- డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు 5లక్షల ట్యాబ్‌ల పంపిణీ
- భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
- అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్‌లు
- ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌లు
- సీఎం జగన్ నేతృత్వంలో కేబినేట్ భేటీ కీలక నిర్ణయాలు
అమరావతి, డిసెంబర్ 13 (ఆంధ్రపత్రిక): వచ్చే ఏడాది జనవరి నుంచి వృద్దుల పెన్షన్ రూ.2750కి పించుతూ ఏపీ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.130.44 కోట్ల అదనపు భారం పడనుంది. తాజా పెంపుతో ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.2500 నుంచి రూ.2750కి పెరగనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 లక్షల పెన్షన్ దారులపై ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా రూ.250 చొప్పున పెన్షన్ మొత్తాన్ని రూ.3వేలకు పెంచుకుంటూ పోతామంటూ ఎన్నికల్లో సీఎం జగన్ హామీ మేరకు కేబినేట్ పెన్షన్ పెంపు నిర్ణయాన్ని ఆమోదించింది. ఈ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2250కు, రూ.2500కు రెండు విడతలుగా పెంచి ప్రస్తుతం మూడో దశలో పెంపుకు నిర్ణయం తీసుకుంది. కొత్తగా డిసెంబరులో ఇవ్వనున్న 2.43 లక్షల మందితో కలుపుకుంటే మొత్తం పెన్షనర్ల సంఖ్య 64.74 లక్షలకు చేరినట్లు కేబినేట్ వెల్లడిరచింది. దీంతో పెన్షన్ల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1786 కోట్లకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో గత టీడీపీ ప్రభుత్వంలో నెలకు పెన్షన్లు కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లుగా ఉన్నట్లు మంత్రులు పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు కేబినేట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 1301 చ.కి.మీ విస్తీర్ణంలో రెండు మున్సిపాలిటీలు 101 గ్రామాలతో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. 8 మున్సిపాటిలీలు, 28 మండలాల్లోని 349 గ్రామాలతో 7,281 చ.కి.మీ. పరిధితో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెలకొల్పనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.మరోవైపు కొత్తగా ఏర్పాటైన జిల్లాలో వైకాపా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన స్థల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిందాల్ స్టీల్‌ను భాగస్వామిగా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయానికి, తితిదేలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం చీఫ్ పీఆర్వో పోస్టు భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.మరొకవైపు వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.. సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు 5లక్షల ట్యాబ్‌ల పంపిణీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.