ఈ పురాతన గణేశుడు విగ్రహం కేవలం రెండు చేతులు, ఏక దంత, ఎడమ చేతిలో మోదకాన్ని పట్టుకుని.. , పసుపు రంగుతో ఉన్న సాధారణ ఆభరణాలతో అలంకరించబడి ఉంది. గణపయ్య బొజ్జకు నాగాభరణం.. లలితాసనం అని పిలువబడే భంగిమలో గణేశుడు కూర్చున్నట్లుగా చెక్కబడి ఉంది. ఈ విగ్రహం మలచిన తీరుని బట్టి.. ఇది 800 ఏళ్ల నాటి కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు.
దేశం ఏ మూల వెదికినా తరచి చూసినా ఎక్కడో చోట సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన పురాతన ఆనవాళ్లు బయల్పడతాయి. మనదేశ గత వైభవాన్ని నేటి తరానికి చాటి చెబుతాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో అతిపురాతన వినాయక విగ్రహం బయల్పడింది. గణపతి నవరాత్రులు జరుగుతున్న వేళ ఇలా వినాయక విగ్రహం వెలుగులోకి రావడం శుభపరిమాణం అంటూ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెద్ద గోల్కొండ గ్రామంలో సుమారు 800 ఏళ్ల నాటి పురాతన గణేశ విగ్రహం తాజాగా బయటపడింది. వినాయక చతుర్థి సమయంలో విగ్రహం కనిపించడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఎస్.జైకిషన్, కొత్త తెలంగాణ చరిత్ర బృందా కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, కో-కన్వీనర్ ఇ.శివనాగిరెడ్డి, బీవీ భద్రగిరీష్ బృందం సహా చరిత్రకారులు, వారసత్వ ఔత్సాహికుల బృందం ఈ అద్భుతమైన ఆవిష్కరణను చేసింది.
ఈ పురాతన గణేశుడు విగ్రహం కేవలం రెండు చేతులు, ఏక దంత, ఎడమ చేతిలో మోదకాన్ని పట్టుకుని.. , పసుపు రంగుతో ఉన్న సాధారణ ఆభరణాలతో అలంకరించబడి ఉంది. గణపయ్య బొజ్జకు నాగాభరణం.. లలితాసనం అని పిలువబడే భంగిమలో గణేశుడు కూర్చున్నట్లుగా చెక్కబడి ఉంది. ఈ విగ్రహం మలచిన తీరుని బట్టి.. ఇది 800 ఏళ్ల నాటి కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. శైలిలో విశిష్టమైనదని పేర్కొన్నారు
అంతేకాదు ఈ బృందం పర్యటిస్తున్న సమయంలో అదే ప్రాంతంలో ఆంజనేయ ఆలయంలో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి ఉమామహేశ్వర, నంది శిల్పాలను కూడా పరిశీలించింది. భవిష్యత్ తరాలకు రక్షణ కల్పించేందుకు అనువర్తిత రంగులను తొలగించి తగిన పీఠాలపై ఉంచడం ద్వారా ఈ శిల్పాలను జాగ్రత్తగా సంరక్షించాలని ఈ బృందం గ్రామస్తులకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ నగర చరిత్రను మరో 400 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పారు.