మా వీధి అధోగతేనా?
గాంధీనగర్ వాసుల ఆవేదన..!
నిరంతరం దోమల స్వైర్య విహారంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న గాంధీనగర్ వాసులు..!
మచిలీపట్నం డిసెంబర్ 8 ఆంధ్ర పత్రిక.
తుఫాను వర్షం తగ్గి నాలుగు రోజులు గడుస్తున్నా కలెక్టరేట్ వెనక రోడ్డు పూర్తిగా మురుగునీటిలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా దుర్గంధం, చెత్తాచెదారం..
మా వీధి తీరు మారదా? అంటూ గాంధీనగర్ వాసులు ఆవేదన చెందుతున్నారు. నిత్యం సమకాలీన సమస్యలతో సతమతమయ్యే సామాన్య మానవుడికి, పగలంతా పనుల్లో నిమగ్నం అయ్యే ఉద్యోగులకు, ఆ వీధిలో రాత్రి ఇళ్ళ వద్ద ప్రశాంతంగా గడపాలంటే బ్రహ్మప్రళయమే. కలెక్టరేట్ వెనక రోడ్డులో మురుగునీటిలో గేదెలు జలకాలాడుతూ దుర్గంధాన్ని వెదజల్లుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
ఇటీవల జిల్లా కలెక్టర్ నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా సిబ్బందితో కలిసి కలెక్టరేట్ చుట్టుపక్కల ఉన్న రహదారులను, రోడ్లను సునిశితంగా పరిశీలించారు. జంగిల్ క్లియరెన్స్ లో భాగంగా కలెక్టరేట్ సుందరీకరణతోపాటు చుట్టుపక్కల రోడ్లు కూడా చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలు రెండు రోజులు అమలుపరిచారేమో, తర్వాత కథ షరామాములే. రోడ్లపై మురుగునీరు చెత్తాచెదారం నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. అయినా నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి చీమైనా కుట్టినట్లు లేదు.
మీడియా సందర్శనలో గురు శుక్రవారాలు రహదారులు ఇంతటి అపరిశుభ్ర వాతావరణంలో దర్శనమిచ్చాయి. రాబోయే సోమవారం స్పందన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆరోజు ఉదయానికి రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. సాక్షాత్తు కలెక్టర్ వారే ఆదేశాలిస్తే నగరపాలక సంస్థ కమిషనర్ పట్టించుకోకపోవడం చూసి మా గాంధీనగర్ తీరు ఇంతే అని ప్రజలు అనుకుంటున్నారు. అసలే తుఫాన్ కి వర్షాలకి నగరంలో చాలా పల్లపు ప్రాంతాలు ఇప్పటికీ నీట మునిగి ఉన్నాయి. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం పరిశుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లించడం, కలెక్టరేట్ గోడ వెనుక ప్రవహిస్తున్న మురుగునీటిపారుదలకు అడ్డుకట్ట వేయడం లాంటి చర్యలు నగరపాలక సంస్థ సిబ్బంది చేపట్టకపోవడం వల్ల మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీటికి తోడు డెంగ్యూ మలేరియా కూడా తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. రోడ్ల విషయంలో భద్రత, మురుగునీరు రోడ్లపై పారకుండా జాగ్రత్త తీసుకునే బాధ్యత నగరపాలక సంస్థకు ఉన్నట్లుగా అనిపించడం లేదని నగర ప్రజలు అనుకుంటున్నారు. పై చిత్రాలు పరిశీలిస్తే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం అవుతుంది. సాక్షాత్తు కలెక్టరేట్ గేటు వెనకాలే ఇలాంటి పరిస్థితి ఉంటే, నగరంలో పల్లపు ప్రాంతాల పరిస్థితి ఇంకా ఎంత అద్వానంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
మురుగునీరు వర్షపు నీరు సమిష్టిగా రోడ్లపై ప్రవహిస్తుంటే వాటికి అడ్డుకట్ట వేయాలి అనే కనీస అవగాహన పారిశుద్ధ్య సిబ్బందికి లేకపోవడం గమనార్హం.
ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహించి, తమ సిబ్బంది పని చేస్తున్నారో? లేదో? పర్యవేక్షణ చేస్తుంటే ఈ దుస్థితి దాపురించదని ప్రజల ఉవాచా. ఎవరో వస్తారని ,ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా? అని ఒక కవి అన్నట్లు పరిస్థితులు ఉండకూడదు. ఎవరికి వారే సామాజిక బాధ్యతతో, తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి అనే అవగాహన సిబ్బందికి ఉండాలి. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే సిబ్బందిలో అవగాహనా రాహిత్యం కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. ఆ వీధిలో వెళ్లే ద్విచక్ర వాహనాలు కూడా బురద మయమైన రోడ్లపై జారిపోయే ప్రమాదం ఉంది. ఆచి తూచి అడుగులు వేస్తూ ఆ వీధిలో నడవాల్సిన దుస్థితి దాపురించింది.
ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు కలెక్టరేట్ చుట్టుపక్కల ఉన్న రోడ్లను సంస్కరించి వాటి దశ, దిశ మార్చే విధంగా కృషి చేస్తారని జిల్లా కలెక్టర్ ఆశించిన విధంగా బాధ్యతాయుతంగా నగరపాలక సంస్థ అధికారులు , పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజాభిమానాన్ని పొందుతారని ఆశిద్దాం..!