నేడే వినాయక చవితి
మచిలీపట్నం సెప్టెంబర్ 17 ఆంధ్రపత్రిక. నేడే వినాయక చవితి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. గణనాథుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు. ఈ సంవత్సరం మట్టి ప్రతిమలు కూడా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి గణపతిని ప్రతిష్టించాలని భక్తులు పూనుకోవడం కూడా శుభ పరిణామమే. నగర ప్రజలు వివిధ రకాల పళ్ళు, పత్రి కొనుగోలు చేయడంలో నిమగ్నం అయిపోయారు. ఈ సంవత్సరం ధరలు కూడా చుక్కల నంటాయి. యాపిల్స్ , అరటిపళ్ళు పంపర పనస, బత్తాయి,ఇలా వివిధ రకాల పళ్ళను కొనుగోలుదారులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో వినాయక చవితికి 200 రూపాయలు ఖర్చు పెడితే పూజా సామాగ్రి పళ్ళు వచ్చేవి అని, ప్రస్తుతం 500 రూపాయలు కూడా సరిపోవడంలేదని గగ్గొలు పెడుతున్నారు. ఇతర ప్రాంతాల భక్తులు కూడా వారి వారి గ్రామాల్లో కూడళ్లలో వినాయక విగ్రహాలు ప్రతిష్టించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నగరమంతా పండగ వాతావరణంతో కళకళలాడుతోంది. చిరు వ్యాపారుల మొహంలో దరహాసం వెల్లి విరుస్తోంది. నగరంలో 50 డివిజన్ల లో వినాయక విగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది. రాజుపేట లో దాదాపు 25 అడుగులతో మట్టి వినాయకుడి ప్రతిమను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నేటి నుండి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుతున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, కూచిపూడి నృత్యం, హరికథలు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వల్ల గత 3 సంవత్సరాలు నగర ప్రజలు పూజలు ఇళ్ల వరకే పరిమితం చేశారు.ఈ సంవత్సరం ముఖ్య కూడళ్ళలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.