ఆదర్శ కమ్యూనిస్టు, విజయవాడ మాజీ మేయర్
లంకా గోవిందరాజులు కన్నుమూత
విజయవాడ నగర సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ మేయర్ కామ్రేడ్ లంకా గోవిందరాజులు (91) మృతి చెందారు. విజయవాడ విద్యాధరపురంలోని
కబేళా సెంటర్లో గల వారి కుమారులు ఇంటివద్ద గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా గోవిందరాజులు
గత మూడేళ్లుగా అస్వస్థులుగా ఉన్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, మనవళ్లు, మనవరాళ్ళు ఉన్నారు. ఆయన సతీమణి లంకా శశిరేఖ
కన్నుమూశారు. మొట్టమొదట నుంచి ఆయనది కమ్యూనిస్టుపార్టీ కుటుంబం. 1932లో విజయవాడ కార్మికపురంలో ఆయన జన్మించారు. పార్టీలో అంచెలంచెలుగా
ఎదుగుతూ నగర కమ్యూనిస్టు సమితి కార్యదర్శిగా, విజయవాడ నగర మేయర్ గా ఆయన ఉన్నత పదవులు అలంకరించారు. విజయవాడ నగర కమ్యూనిస్టు సమితి
కార్యదర్శులుగా పనిచేసిన కమ్యూనిస్టు యోధులు టి.వెంకటేశ్వరరావు, తమ్మిన పోతరాజు, చలసాని వెంకటరత్నం, దాసరి నాగభూషణరావు, ఉప్పలపాటి
రామచంద్రరాజులతో కల్సి నగరంలో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు, బలోపేతానికి విశేష కృషి చేశారు.
కామ్రేడ్ లంకా గోవిందరాజులు విజయవాడ నగర పాలక సంస్థ ఏర్పడిన అనంతరం 1981లో జరిగిన తొలి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన 27వ
డివిజన్ (ప్రస్తుతం 20వ డివిజన్) కార్పొరేటర్ అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలు కార్పొరేటర్‌గా ఎన్నికైన గోవిందరాజులు 1981 నుండి
82 వరకు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గానూ, 1983 నుంచి 84 వరకు డిప్యూటీ మేయర్, 1984 నుండి 85 వరకు మేయర్ గా ప్రజారంజకంగా
బాధ్యతలు నిర్వర్తించారు. 1980లో ఆయన సోవియట్ యూనియను సందర్శించారు. 2000 సంవత్సరం వరకు ఆయన కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా
పనిచేశారు.
ఆదర్శవంతమైన కమ్యూనిస్టుకు నిలువెత్తు నిదర్శనం కామ్రేడ్ గోవిందరాజులు. క్రమశిక్షణ, నిబద్ధతకు ఆయన మారుపేరు. అట్టడుగువర్గం నుంచి వచ్చిన
ఆయన చదువుకున్నది 5వ తరగతి అయినప్పటికీ మార్క్సిజాన్ని ఆకళింపు చేసుకుని సమసమాజ లక్ష్యసాధన ధ్యేయంతో పనిచేశారు. నగరంలో కమ్యూనిస్టు
ఉద్యమాన్ని బలోపేతం చేసి పేద, మధ్యతరగతి వర్గాలను సమీకరించి, వారి సమస్యల పరిష్కారానికి నిర్విరామ కృషి చేశారు. విజయవాడలో జరిగిన భూ ఆక్రమణ
ఉద్యమంలో స్వయంగా ఆయన నాయకత్వం వహించి ముందుకు నడిపారు. 1974 నుంచి 1989వరకు 15 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు నగర కమ్యూనిస్టు
సమితి కార్యదర్శిగా పనిచేశారు. పార్టీలోనూ, నగర పాలక సంస్థలోనూ అనేక పదవులు అలంకరించినప్పటికీ నిరాడంబర జీవితాన్నే గడిపారు. గోవిందరాజుల
ముగ్గురు సోదరులు లంకా వెంకటేశ్వరరావు, లంకా పోతరాజు, లంకా రామకోటేశ్వరరావులు కూడా పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. పార్టీపై నిషేధ సమయంలో
ఆయన జైలు శిక్ష అనుభవించారు. ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసుల్లో ఆయన రాజమండ్రి, నూజివీడు, విజయవాడ సబ్ జైళ్ళలో జైలు జీవితం గడిపారు.
ఎన్ని ఒడిదుడుకులెదురైనప్పటికీ ఏనాడూ కూడా పార్టీ సిద్ధాంతాలు, పంథా నుంచి ఒక్క అంగుళం కూడా ఆయన వైదొలగలేదు. కమ్యూనిస్టుపార్టీ నాయకునిగా
ఆయన ముగ్గురు కుమారులకు ఆదర్శవంతంగా పార్టీ వివాహాలే జరిపించారు. ఆయన మనుమడు లంకా గోవిందరాజులు (జూనియర్) ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా
ఏఐవైఎఫ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
జైఆంధ్రా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో నగర పార్టీ కార్యదర్శిగా ఉన్న ఆయన వేర్పాటువాదులు విశాలాంధ్ర పత్రిక కార్యాలయంపైనా,
నగర సీపీఐ కార్యాలయంపైనా దాడి జరపాలని భావించిన సందర్భంలో ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తలతో మకాం పెట్టి వాటిని కాపాడారు. భవిష్యత్ తరం యువ
కమ్యూనిస్టులకు నగర పార్టీ ఉద్యమ చరిత్ర గురించి తెలియజేయాలన్న సంకల్పంతో గోవిందరాజులు రాసిన సీపీఐ విజయవాడ నగర ఉద్యమ చరిత్ర’ పుస్తకాన్ని
2015లో ముద్రించగా, ఆ ఏడాది జరిగిన భారత కమ్యూనిస్టుపార్టీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దాసరి భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
ఆవిష్కరించారు.
దాసరి భవన్లో నివాళులు
నగర సీపీఐ కార్యాలయం దాసరి భవన్ వద్ద లంకా భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు
ఉంచారు. ఆయన భౌతికకాయంపై సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, కార్యవర్గసభ్యులు దోనేపూడి శంకర్, పెన్మత్స దుర్భాభవాని,సీపీఐ
రాష్ట్ర సమితి సభ్యులు వై. చెంచయ్య, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల కార్యదర్శులు సీహెచ్ కోటేశ్వరరావు, నార్ల వెంకటేశ్వరరావులు, విజయవాడ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావులు
పార్టీ పతాకాన్ని కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆర్. రవీంద్రనాథ్, జి.ఓబులేసు, విజయవాడ నగర సీపీఐ సహాయ
కార్యదర్శులు నక్కా వీరభద్రరావు, లంకా దుర్గారావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కోశాధికారి ఆర్. పిచ్చయ్య, నజీర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి
రాజేంద్ర, లెనిన్‌బాబు, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి శైలజ, నగర మహిళా సమాఖ్య కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, ఏఐటీయూసీ నగర అధ్యక్ష,
కార్యదర్శులు కేఆర్ ఆంజనేయులు, మూలి సాంబశివరావు, విశాలాంధ్ర పూర్వపు అసిస్టెంట్ ఎడిటర్ ఎస్కే బాబు, బ్యూరో చీఫ్ చావా రవి, సీపీఎం నేతలు సీహెచ్
బాబురావు, ఉమామహేశ్వరరావు, కాశీనాథ్, వైసీపీ నాయకులు పి.గౌతం రెడ్డి, సీపీఐ నగర డివిజన్ల కార్యదర్శులు, ప్రజాసంఘాల నేతలు, నగరంలోని వివిధ
రంగాల ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు లంకా భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సీపీఐ నారాయణ, రామకృష్ణ సంతాపం
విజయవాడ నగర మాజీ మేయర్ లంకా గోవిందరాజులు మరణం పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణలు ప్రగాఢ
సంతాపం తెలిపారు. విజయవాడ నగర మేయర్, కార్పొరేటర్ , సిపిఐ విజయవాడ నగర కార్యదర్శిగా ఆయన విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజా
సమస్యల సత్వర పరిష్కారానికి, విజయవాడ నగర అభివృద్ధికి లంకా గోవిందరాజులు ఎంతో కృషి చేశారనీ, జీవిత చరమాంకం వరకు అతి సాధారణ జీవితం
గడిపిన లంకా గోవిందరాజులు మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. లంకా గోవిందరాజులు మరణంపట్ల ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ
సభ్యులకు సానుభూతిని నారాయణ, రామకృష్ణలు తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!