నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేల పరిహారమివ్వాలి
- మాండౌస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం
- దళారులకు అమ్ముకోవాలని ప్రభుత్వమే సూచించడం సరికాదు
- అరటి, బొప్పాయి, పొగాకు, పప్పు శనగ, మిరప, పత్తి పంటలకు తీవ్ర నష్టం
- అన్ని జిల్లాల్లో తరుగు లేకుండానే ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి
- తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి,డిసెంబర్ 15 (ఆంధ్రపత్రిక): మాండౌస్ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని, వారి సమస్యలు పరిష్కరించాలని తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్రెడ్డికి ఆయన లేఖ రాశారు. మాండౌస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తుపాను కార ణంగా అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వరి, అపరాలు, అరటి, బొప్పాయి, పొగాకు, పప్పు శనగ, మిరప, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు.మరోవైపు ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వం భారీగా కోత విధించిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ ఆంక్షలు, కొత్త నిబంధనల కారణంగా పంటను సరైన ధరకు అమ్ముకునే పరిస్థితి లేక.. రైతులు నానా యాతన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యంలో తేమ 17 శాతం కంటే అధికంగా ఉంటే మద్దతు ధరలో కోత కోస్తున్నారని, తేమశాతం తగ్గించుకునేందుకు ధాన్యాన్ని 20 రోజులకు పైగా ఆరు బయట ఉంచాల్సి వస్తోందన్నారు. ధాన్యం కొనుగోలుకు పరిమితులు విధించి.. దళారులకు అమ్ముకోవాలని ప్రభుత్వమే సూచించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. రాయితీపై రైతులకు అందించే టార్ఫాలిన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్లుగా నిలిపివేసిందని మండిపడ్డారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.25 లక్షల ఎకరాల్లో పొగాకు రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో తరుగు లేకుండానే ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తుపాను వల్ల నష్టపోయిన వరి, అపరాలకు ఎకరానికి రూ.20 వేలు, వాణిజ్య, ఉద్యానవన పంటలకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు నేరుగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.