బెంగళూరు: గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna)కు బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్ట్టు సమాచారం. బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు సమాచారం. దీంతో ఆసుపత్రి వద్ద భద్రతను పెంచడంతో పాటు స్థానిక పోలీసులు కాన్వాయ్ సిద్ధం చేస్తున్నారు. గురువారం తారకరత్నకు ఎం.ఆర్.ఐ స్కానింగ్ చేసిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి శనివారం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ, ఆరోగ్య పరిస్థితి అలాగే ఉందన్నారు. తారకరత్నను హైదరాబాద్ తరిలించే విషయమై కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారని తెలిపారు.