అసలే కోతి.. ఆపై కల్లు తాగిందన్నట్లు..అసలే రామోజీ.. ఆపై ఒంటిపై టీడీపీ పూనింది.. ఆ పూనకంలో ఒళ్లు మరిచి తానేం రాస్తున్నారో… ఏమాలోచిస్తున్నారో..
తెలియని అజ్ఞానంలో రాసిన తప్పుడు కథనాలను తిరగరాయిస్తూ.. ఏదో విధంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న దుష్ట సంకల్పంలో ఉన్నారీ పచ్చ చొక్కా రాతలను అచ్చోసినట్లు జనం లోకి వదిలేస్తున్నారు.. సింగిల్ కాలమ్ వార్తలో అయినా ఎవరిపైనైనా ఆరోపణలు చేస్తే..వివరణ లేనిదే ప్రచురించే రోజులు మరిచిపోయిన ఈ మేధావి.. వయసు తెచ్చిన చిత్తచాంచల్యంతో.. వ్యక్తిత్వ హననంతో చిత్తమొచ్చిన రీతిలో మర్యాద, మన్నన లేని గ్రాఫిక్ కేరికేచర్లతో వైఎస్ఆర్సీపీపై నిష్ట దరిద్రపు కథనాలను వెలువరిస్తున్నారు.
పాత్రికేయం అంటే ఇంత నీచంగా ఉంటుందా?..ఇంతకు దిగజారిందా?.. ఇంత దురహంకారంతో రాస్తుందా?.. అని పాఠకులు నివ్వెరపోయే కథనాలు అచ్చోసి, తన కుసంస్కారాన్ని రామోజీ సిగ్గూఎగ్గులను వదిలేసి బట్టబయలు చేసుకుంటున్నారు.. బాబు హయాంలో పెంచి పోషించిన గంజాయి వనాలు ఇంతలింతలుగా రాష్ట్రాన్ని కమ్ముకుంటే ఒక్క సారైనా బాబుకు వ్యతిరేకంగా వార్తలు రాయని ఈ పక్షపాత పాత్రికేయానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వం గంజాయిని సమూలంగా నిర్మూలిస్తుంటే నచ్చడం లేదు
అందుకే ‘ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా ‘.. శీర్షికన బుధవారం ఒక ఉన్మత్త కథనాన్ని పునర్ముద్రించారు. నెలలో రెండు మూడుసార్లయినా ఒకే అంశంపై ఈ అబద్ధాల బాగోతాన్ని కొనసాగించడం రామోజీకి అలవాటైపోయింది. ఈ సాగు నిరోధానికి గిరిజనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్‌ను కేంద్రం ప్రశంసించిందన్న నిజమైనా రామోజీకి తెలుసో లేదో…వెర్రివాళ్ల గురించి వినడమే తప్ప చూడలేదని ఓ సినిమాలో డైలాగు రామోజీకి సరిపోతుంది. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా రాష్ట్రంలో గంజాయి దందాను ధ్వంసం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనతను మరోసారి గుర్తు చేసేందుకే ఈ ఫ్యాక్ట్ చెక్.
అమరావతి: పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నాట్ట వెనకటికి ఎవరో… ప్రస్తుతం ఈనాడు రామోజీరావు పరిస్థితి సరిగ్గా అలానే ఉంది. ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతోందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక రామోజీరావుకు మంట నషాళానికి కెక్కుతోంది.లేనిది ఉన్నట్టుగా…. ఉన్నది లేనట్టుగా భ్రమపడుతూ తలతిక్క రాతలతో పాత్రికేయాన్ని అధఃపాతాళానికి దిగజార్చేశారు.
హైదరాబాద్ శివార్లలో ఆక్రమించి కొండ మీద కట్టుకున్న అక్రమ భవంతిలో రాత్రిళ్లు నిద్రపట్టక పాత్రికేయ అఘోరా అవతారం ఎత్తి హశ్శరభ అంటూ పూనకాల లోడింగ్‌లో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా… వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎంతటి విషం కక్కుతున్నా… పిచ్చి రాతలు, కారుకూతలతో ఈనాడు పత్రికను తాను నింపేస్తున్నా ప్రజలు ఎందుకు నమ్మడం లేదంటూ రామోజీ బుర్ర బద్దలు కొట్టుకుంటూ కరాళ నృత్యం చేస్తున్నట్టుగా ఉంది.
పిచ్చో.. భ్రాంతో.. భయమో తెలియని అపస్మారక స్థితిలో ఈనాడు పత్రిక నిండా మరోసారి గంజాయి మత్తు రాతలు రాసేశారు…నిజాలనేవి ఎప్పుడూ చేదుగానే ఉంటాయి కనుక ఆ ఉన్మత్త రాతల మత్తును వదిలించే వాస్తవాలివి.
చంద్రబాబు హయాంలోనే గంజాయి దందా వ్యవస్థీకృతం
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే గంజాయి దందా వ్వవస్థీకృతమైందన్న వాస్తవాన్ని దాచలేరు… బాబు ముఠా సభ్యుడైన అయ్యన్న పాత్రుడి కనుసన్నల్లోనే నర్సీపట్నం కేంద్రంగా అంతర్రాష్ట గంజాయి సిండికేట్ నడిచిందన్న నిజాన్ని కప్పిపుచ్చలేరు.రాష్ట్రంలో వేళ్లూనుకున్న గంజాయి దందాను సీఎం వైఎస్ జగన్ కూకటి వేళ్లతో సహా పెకలించివేశారన్న నిజాన్ని ఈనాడు చెప్పకున్నా రాష్ట్రం మొత్తానికీ తెలుసు. అందుకోసం ప్రత్యేకంగా నెలకొల్పిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సాధించిన విజయాలు యావత్ దేశానికీ తెలుసు.
ఆపరేషన్ పరివర్తన్‌తో ముఖచిత్రం మారిన మన్యానికీ తెలుసు.ప్రత్యామ్నాయ పంటల సాగుతో తమ జీవితాల్లో వచ్చిన నవోదయం గిరిజనులకు తెలుసు…ఏపీ గుండా గంజాయి స్మగ్లింగ్ చేయాలంటే వణికిపోతున్న ఇతర రాష్ట్రాల స్మగ్లర్లకూ తెలుసు…ఇందరికీ తెలిసిన సంగతి రామోజీకి ఒక్కరికే తెలియనంత అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు.
చంద్రబాబు ముఠా… గంజాయి దందా…
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆయనకు అత్యంత సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా గంజాయి సిండికేట్‌ను నిర్వహించారు. అప్పట్లో ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో యథేచ్ఛగా గంజాయి సాగు చేయించారు. నాటి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఈ గంజాయి దందాకు పూర్తి అండదండలు అందించారు.
అప్పట్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడికి సమీప బంధువైన ఆయన గంజాయి సాగుకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఓ వితండవాదాన్ని సమర్థంగా తెరపైకి తెచ్చారు. గంజాయి సాగును అడ్డుకుంటే గిరిజనులు నక్సలైట్లకు అనుకూలంగా మారతారన్న మూర్ఖపు వాదనతో ఆ సాగును వటవృక్షం చేసిందే బాబు. పర్యవసానంగా…విశాఖపట్నం ఏజెన్సీలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు యథేచ్ఛగా సాగిపోయింది.
దీన్ని నర్నీపట్నంలోని టీడీపీ సిండికేట్ నేతలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. అందుకోసం ప్రత్యేకంగా వ్యవస్థీకృత కొరియర్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు. ఏపీని గంజాయి దందాకు గేట్వేగా మార్చి…చంద్రబాబు ముఠా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి తమ ఖజానాను నింపేసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో గంజాయి దందా సాగుతోందని అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులే గతంలో పత్రికాముఖంగా అంగీకరించడం గమనార్హం.
గంజాయి దందాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి దందాపై ఉక్కుపాదం మోపింది. ఈ సాగును నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు యంత్రాంగాన్ని విస్పష్టంగా ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను తుదముట్టించేందుకు ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి, ఈ బ్యూరోకు విసృ్తత అధికారాలు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ‘సెబ్’ గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రెండు దశల్లో నిర్వహించిన ఆపరేషన్ పరివర్తన్ విజయవంతమైంది.
ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం…
ముందుగా గంజాయి సాగు వల్ల అనర్థాలపై ఆపరేషన్ పరివర్తన్ ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో విసృత అవగాహన కల్పించింది. పోలీసు, రెవెన్యూ, సెబ్, గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ పంట సాగు నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర -ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని జియో మ్యాపింగ్ చేశారు. అనంతరం ప్రత్యేక యంత్రాలతో సాగును ధ్వంసం చేశారు. రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు.
ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న గంజాయిని ఆంధ్రప్రదేశ్ గుండా అక్రమ రవాణాను చేయనివ్వకుండా పోలీసు యంత్రాంగం సమర్థంగా అడ్డుకుంటోంది. ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విసృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాధీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 2,950 వాహనాలను జప్తు చేసింది.
గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం…
గంజాయి సాగు జాఢ్యం మన రాష్ట్రానికే పరిమితమైన అంశం కాదు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యం అంతటా దశాబ్దాలుగా వేళ్లూనుకుంది. సరిహద్దులకు అవతల ఉన్న ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాల పరిధిలోని దండకారణ్యంలో ఈ సాగు కొనసాగుతోంది. ఏపీ పోలీసు శాఖ ఒడిశా, చత్తీస్ఘడ్, తెలంగాణ రాష్ట్రాలతో విశాఖపట్నంలో ప్రత్యేక సదస్సు నిర్వహించి గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించింది. మరోవైపు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లలో పండించిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ గుండా స్మగ్లింగ్ చేయకుండా కట్టడి చేసింది. అందుకోసం అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు ఉత్తరాంధ్ర నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వరకు సెబ్ అధికారులు విసృ్తతంగా దాడులు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు.
నెట్వర్క్ నేలమట్టం…
అంతర్రాష్ట్ర గంజాయి నెట్‌వర్క్‌ను ఏపీ ప్రభుత్వం నేలమట్టం చేసింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 14వేల మంది గంజాయి పెడ్లర్లను సెబ్ గుర్తించింది. వారిపై నిఘా పెట్టి … విసృతంగా దాడులు నిర్వహించి ఇప్పటికే 9 వేల మందికి పైగా అరెస్ట్ చేసింది. ఏవోబీలో వారి ఏజంట్ల వ్యవస్థను నిర్మూలించింది. 1,883 మందిపై హిస్టరీ షీట్లు తెరిచింది. వారి కదలికలపై సదా నిఘా కొనసాగిస్తోంది. ఇది కాకుండా 239 మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టింది.
నాడు ఉదాసీనం…నేడు కఠినంగా అణచివేత..
ఎక్కడైనా దొంగలు దోచుకున్న సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకుని దొంగలను అరెస్ట్ చేస్తే ఆ పోలీసు శాఖ సమర్థంగా పనిచేస్తున్నట్టుగా పరిగణిస్తారు. అలానే ఇతర రాష్ట్రాల్లో పండించి స్మగ్లింగ్ చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుంటే…నిందితులను అరెస్ట్ చేస్తే ఆ ప్రభుత్వం సమర్థంగా పని చేస్తున్నట్టు లెక్క. ఈనాడు దీన్ని వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు రాసిన తప్పుడు కథనాన్నే పునర్ముద్రిస్తూ ఇన్నిసార్లు ప్రచురిస్తున్నాం కనుక ఒక్కసారైనా జనం నమ్మకపోతారా? అనే వెర్రితనంలో రామోజీ ఉన్నట్లున్నారు.
ఓ వైపు రాష్ట్రంలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుంటుంటే…దాన్ని పట్టించుకోకుండా ….రాష్ట్రం గంజాయి వనంగా మారిపోతోంది… వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి దందాను ప్రోత్సహిస్తోందని దుష్ప్రచారం చేయడం రామోజీ దిగజారుడు పాత్రికేయానికి నిదర్శనం. మరి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంత పెద్దమొత్తంలో గంజాయిని ఎందుకు జప్తు చేయలేదో , ఎందుకు తగలబెట్టలేదో రామోజీనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో గంజాయి దందా టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగేది. తద్భిన్నంగా… వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు కంకణం కట్టుకుంది.
అందుకే విసృతంగా దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలించింది. ఇతర రాష్ట్రాల్లో సాగు చేస్తూ మన రాష్ట్రం గుండా అక్రమ రవాణా చేస్తున్న గంజాయిని భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనాలనూ జప్తు చేశారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. ఈ దందాకు తరచూ పాల్పడుతున్నవారిపై పీడీ యాక్ట్కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడుతున్నారు.
గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం
– రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం
దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తెచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అందుకోసం రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుసెనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచితంగా విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ఇ-క్రాపింగ్ ద్వారా అన్నిరకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ సహకారంతో గిరిజనులు మొదటి దశలో 7,328 ఎకరాల్లో, రెండో దశలో 10,290 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టారు. ఇక 50 వేల ఎకరాలపై ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసి 1,13,000 మంది గిరిజన రైతులకు శాశ్వత ప్రయోజనం కలిగించింది.
ఆపరేషన్ పరివర్తన్కు కేంద్రం ప్రశంస…
గంజాయి దందాను నిర్మూలించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్‌ను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అభినందించింది. ప్రత్యేక పరిశీలకులను పంపించి ఆపరేషన్ పరివర్తన్ పై అధ్యయనం చేయించింది. గంజాయి సాగును సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. దేశం మొత్తం మీద గంజాయి సాగు ధ్వంసంలో ఏపీ మొదటిస్థానంలో ఉందని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.