స్టాఫ్ నర్స్ పోస్టుల (Staff Nurse Posts)కు బుధవారం దరఖాస్తులు (Applications) వెల్లువెత్తాయి. ఆఖరి రోజు ఏకంగా 5 వేల దరఖాస్తులొచ్చాయి. సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమివ్వగా

హైదరాబాద్, ఫిబ్రవరి 15 : స్టాఫ్ నర్స్ పోస్టుల (Staff Nurse Posts)కు బుధవారం దరఖాస్తులు (Applications) వెల్లువెత్తాయి. ఆఖరి రోజు ఏకంగా 5 వేల దరఖాస్తులొచ్చాయి. సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమివ్వగా అభ్యర్థులు అప్లై చేస్తుండగానే 4.30 గంటలకే వెబ్సైట్లో అప్లికేషన్ క్లోజ్ (Application close) అని చూపించింది. ఇటు సైట్ కూడా బాగా మొరాయించిందని నర్సింగ్ అభ్యర్థులు (Nursing Candidates) చెబుతున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల అభ్యర్థన మేరకు మెడికల్ బోర్డు (Medical Board) మెంబర్ సెక్రటరీ గోపీకాంత్ రెడ్డి తుది గడువును పెంచారు. ఈనెల 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ అధికారిక ప్రకటన జారీ చేశారు. దీంతో మరో 6 రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. గతేడాది డిసెంబర్ 30న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Telangana Medical Health Services Recruitment Board) నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి జనవరి 25 నుంచి ఈనెల 15 సాయంత్రం 5 గంటలవరకు అప్లై చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం వరకు మొత్తం 40 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ (Department of Health) ఉన్నతాధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఒక్కో పోస్టుకు 8 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తు గడువు పెంచడంతో ఇది మరింత పెరగనుంది.
దరఖాస్తుల్లో ఎందుకు జాప్యమైందంటే?
నర్సింగ్ అభ్యర్థుల దరఖాస్తులు ఆలస్యమవడానికి పలు కారణాలున్నాయి. అభ్యర్థులు నర్సింగ్ సర్టిఫికెట్ల (Nursing Certificates)ను నర్సింగ్ కౌన్సిల్లో ఐదేళ్లకోమారు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. 5,204 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ రావడంతో రెన్యువల్స్ కోసం నర్సింగ్ అభ్యర్థులంతా ఒకేసారి కౌన్సిల్ ముందుకొచ్చారు. రద్దీ పెరగడంతో కౌన్సిల్ సిబ్బంది సకాలంలో ఆ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. దీంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ (Outsourcing Staff Nurse)లకు సంబంధిత సూపరింటెండెంట్స్, డీఎంహెచ్వోలు సకాలంలో ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తు ప్రక్రియలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది.