ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపై ఇప్పటివరకూ తన మనసులో ఉన్న మాటను పవన్ కళ్యాణ్ బయటపెట్టేశారు. జైల్లో చంద్రబాబును పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ జనసేన పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తీసుకోబోయే నిర్ణయాలు కీలకం కానున్నాయి. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ విస్తృత స్ధాయి భేటీ మొదలుకానుంది. ఇందులో పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల ఇన్ ఛార్జ్ లు, కీలక నేతలతో పవన్ భేటీ అవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన తర్వాత పవన్ స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని పవన్ ప్రకటించిన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా వచ్చే ప్రకటనలపై ఉత్కంఠ నెలకొంది.టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్న పవన్.. ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే సమన్వయం కోసం ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ కమిటీలో ఉండే సభ్యుల్ని ఖరారు చేయడంతో పాటు వీరు చేయాల్సిన పనుల్ని ఖరారు చేయబోతున్నారు. అలాగే టీడీపీతో ఎన్నికల వరకూ క్షేత్రస్ధాయిలో ఎలా వ్యవహరించాలన్న దానిపై కార్యకర్తలకు పవన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో ఈ భేటీలో పవన్ ప్రకటనలు కీలకంగా మారాయి. అటు బీజేపీతో పొత్తు విషయంలోనూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ-జనసేన పొత్తు తర్వాత బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందన్న ఆశాభావాన్ని పవన్ వ్యక్తం చేశారు. అయితే ఏపీ బీజేపీ మాత్రం వెంటనే ఏ క్లారిటీ ఇవ్వలేదు. జాతీయ స్ధాయిలో తమ పొత్తులు ఖరారవుతాయని మాత్రమే చెప్పింది. దీంతో బీజేపీ విషయంలో ఎలా వ్యవహరించాలనేది కూడా పవన్ నిర్ణయించబోతున్నారు. ఇలా టీడీపీ, బీజేపీ విషయంలో పవన్ ఇవాళ చేసే ప్రకటనలు కీలకంగా మారాయి.