తమ ప్రేమను పెళ్లి బంధంతో పండించుకోవాలనుకున్నారు. కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ ప్రియుడికి మరో యువతితో పెళ్లి నిశ్చయమైంది. తనే సర్వస్వమని, తనతోనే నూరేళ్ల జీవితం గడపాలని ఆశపడిన ఆ యువతికి కన్నీళ్లే మిగిలాయి. మరో యువతితో పెళ్లికి రెడీ అయిన ప్రియుడు మాత్రం ఆమెలోని ప్రేమను గుర్తించలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే యువతి ముఖంపైనే నానామాటన్నాడు. నువ్వు లేకుండా నేను బతకలేనని చెబితే.. ఛస్తే చావమని పురుగుల మందు కూడా కొనిచ్చాడు. దీంతో గుండె పగిలిన ఆమె ఇన్నాళ్లూ తనతో ప్రేమ నటించి, ఇప్పుడు చావమని చేతిలో విషం పెట్టడంతో.. బాధతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందా అభాగ్యురాలు. ఈ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తూర్పుగోదావరి జిల్లాలోని యు. కొత్తపల్లికి చెందిన ఉమామహేశ్వరరావుకు ఏడేళ్ల క్రితం కాకినాడ గొడారి గుంటకు చెందిన యామిని (24) అనే యువతితో పరిచయం ఏర్పడింది. 2017లో తొలిసారి కలిసిన వీరు.. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. ఉమామహేశ్వరరావు ప్రేమలో మునిగిన ఆ యామిని అతనితో ఎంతో చనువుగా ఉండసాగింది. ఆమెలోని అతి ప్రేమను గమనించిన ఉమామహేశ్వరరావు ఆమెను అన్ని విధాలుగా వాడుకున్నాడు. ఈ క్రమంలో తమ ప్రేమను పెళ్లి పీటలెక్కించాలని భావించిన యామిని, అతడిని పెళ్లి చేసుకోమని కోరింది. దీంతో తన ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ దాటవేశాడు. తాజాగా మరో యువతితో ఉమామహేశ్వరరావు పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల ఉమామహేశ్వరరావు ఆమెతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన యామిని ప్రియుడిని నిలదీసింది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా? నన్నెందుకు మోసం చేశావంటూ కుమిలిపోయింది. నువ్వు లేకపోతే బతకలేనని.. పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. కానీ ఉమా మహేశ్వరరావు మాత్రం కఠినంగా.. ‘ఛస్తే చావు గానీ.. నా పెళ్లికి అడ్డురావద్దని’ తెగేసి చెప్పాడు. ప్రేమలో మోసపోయానన్న బాధలో యామిని పురుగుల మందు కొనుక్కోవడానికి ఫెర్టిలైజర్ షాపునకు వెళ్లగా.. ఆమె వెనకాలే వెళ్లిన ఉమామహేశ్వరరావు పురుగుల మందుకు డబ్బులు చెల్లించి వెళ్లిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన వాడే చావమని చెప్పడంతో కుమిలిపోయిన యామని పురుగుల మందు తాగి, మృతి చెందింది. కుమార్తె మృతితో తల్లడిల్లిన తల్లిదండ్రులు యామిని ఫోన్లో మెసేజ్లు చూసి ఉమామహేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నయవంచన చేసిన ఉమామహేశ్వరరావును అరెస్టు చేసి, జైలుకు తరలించారు.