మచిలీపట్నం, డిసెంబర్ 5 ఆంధ్ర పత్రిక.
మిఛాన్గ్ తుఫానుకు ప్రభావితం అయిన జిల్లాల్లో బాధితులు, అన్నదాతలకు ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల్లో ఉద్యోగులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు స్వచ్చందంగా పాల్గొనాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు సూచించారు. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే నని సురేష్ బాబు అన్నారు.మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దివిసీమ బందరు మండలం, చుట్టుపక్కల మండలాలు అస్తవ్యస్తమయ్యాయని అన్నారు. అన్నదాతకు చేతికి వచ్చిన పంట, నేలపాల అవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోవాలని అన్నారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల హక్కులు,సమస్యల పరిష్కారం కొరకు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో, ప్రజా సమస్యలలో కూడా పాలు పంచుకొని సమాజంలో విపత్తుల నెలకొన్నప్పుడు సామాజిక బాధ్యత కలిగి ఉండి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. సామాజిక బాధ్యతలు నిర్వర్తించడం ఉద్యోగులు,ఉద్యోగ సంఘాల ప్రాథమిక విధిగా భావించాలని కోరారు. తద్వారా ఉద్యోగుల పట్ల ప్రజల్లో ఆదరాభిమానాలు పెరిగి వారి సంపూర్ణ మద్దతు ఉద్యోగులకు లభిస్తుందన్నారు. .తుఫాను విధుల్లో లేని ఉద్యోగులు బాధితులకు ఆపన్న హస్తం అందించి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలో పాల్గొనడం, అన్నదాతల సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళటం, పునరావాస కేంద్రాలలో బాధితులను కలిసి సమస్యలు తెలుసుకోవడం, చేయాలని కోరారు. తుఫాను ప్రభావిత తొమ్మిది జిల్లాలలో తుఫాను విధుల్లో లేని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు, సంఘ నాయకులు స్వచ్చందంగా కొంత సమయం సహాయక చర్యలకు కేటాయించాలని సురేష్ బాబు పిలుపునిచ్చారు.