- తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లోనే..!
- ప్రస్తుతం పరిమిత స్థాయి వినియోగానికి మాత్రమే…
ముంబయి,అక్టోబర్ 7 (ఆంధ్రపత్రిక): సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని త్వరలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించను న్నట్లు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం పరిమిత స్థాయి వినియోగానికి ఈ ఇ-రూపీని తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్టును విస్తరిస్తున్న కొద్దీ సీబీడీసీ లక్షణాలు, ప్రయోజనాలను తెలియజేస్తామని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఓ ‘కాన్సెప్ట్ నోట్’ను విడుదల చేసింది. దీంట్లో సీబీడీసీ వెనకున్న సాంకేతికత, భవిష్యత్తులో దీని ఉపయోగాలు, జారీ విధానం, డిజైన్ ప్రత్యామ్నాయాల వంటి వివరాలను వివరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన కరెన్సీకి ఇ-రూపీ అదనపు వెసులుబాటు మాత్రమేనని ఆర్బీఐ కాన్సెప్ట్ నోట్ పేర్కొంది. బ్యాంకు నోట్లతో పోలిస్తే ఇది ఏమాత్రం భిన్నమైంది కాదని తెలిపింది. కేవలం డిజిటల్ రూపంలో ఉండడమే ప్రత్యేకత అని వివ రించింది. మరింత సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో లావాదేవీలు పూర్తవుతాయని పేర్కొంది. ఇతర డిజిటల్ మనీ తరహాలోనే అన్ని లావాదేవీ ప్రయోజనాలు ఇ-రూపీకి ఉంటాయని స్పష్టం చేసింది.