మచిలీపట్నం అక్టోబర్ 16 ఆంధ్ర పత్రిక. :
నగరంలోని వివిధ దేవాలయాల్లో రెండో రోజు ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. నగరమంతా ఆధ్యాత్మిక శోభతో పరిమళించింది.శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు లో భాగంగా రెండవ రోజు సోమవారం వైభవంగా జరిగాయి. శ్రీ పార్వతీ దేవికి, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి సహస్రనామ కుంకుమార్చనలు, స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఉదయం జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాత్రి శ్రీ పార్వతీ దేవిని శ్రీ గాయత్రీ దేవిగా, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని శ్రీ గజలక్ష్మి దేవిగా అలంకరించారు. సుప్రసిద్ధ సంగీత కళాకారిణి కాళీపట్నం ఉమ, శిష్య బృందం నిర్వహించిన స్వరలహరి కార్యక్రమం భక్తులను అలరించింది. వారు ఆలపించిన కీర్తనలు గేయాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పంచ వాయిద్యాలతో నక్షత్ర హారతి, నీరాజన మంత్ర పుష్పాలు తీర్థప్రసాద వినియోగం జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ, కార్యదర్శి మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, ఉపాధ్యక్షుడు సామా వెంకట లక్ష్మీ కాంతారావు, సహాయ కార్యదర్శి బైసాని హయగ్రీవ రావు, కోశాధికారి ఉడత్తు శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్థానిక ఈడేపల్లి శక్తి గుడి వద్ద అమ్మవారికి విశేషాలంకరణలు పూజలు నిర్వహించారు. త్రిశక్తి పీఠంలో అమ్మవారిని రకాల పూల తో అలంకరించారు. హిందూ కళాశాల సరస్వతి దేవాలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక దత్తాశ్రమంలో అమ్మవారికి పూజలు నిర్వహణ, యజ్ఞాలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మ గుడి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు వివిధ దేవాలయాలు సందర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు.