కల్తీ మద్యం తాగి గతంలోనూ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు
బిహార్ సీఎం ఘాటు వ్యాఖ్య
పట్నా,డిసెంబర్ 15 (ఆంధ్రపత్రిక): బిహార్‌లో కల్తీ మద్యం తాగి 40 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష భాజపాతో పాటు బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. వీటిపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మద్యం తాగితే చస్తారని ఘాటుగా వ్యాఖ్యానించిన ఆయన.. ప్రజలు ఈ విషయంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2016 నుంచి మద్యనిషేధం అమల్లో ఉన్న విషయాన్ని నీతీశ్ కుమార్ గుర్తుచేశారు.‘కల్తీ మద్యం తాగి గతంలోనూ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అడుగు తున్నారు. మద్యం తాగినవారు కచ్చితంగా చనిపోతారు. ఇందుకు మన కళ్లముందున్న ఘటనే సాక్ష్యం’ అని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ వ్యాఖ్యా నించారు. మద్యపాన నిషేధం అమల్లో లేని సమయంలోనూ కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేవలం బిహార్‌లోనే కాకుండా నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌తోపాటు పంజాబ్‌లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయన్నారు. బిహార్‌లో మద్యనిషేధ అమలుకు అన్నిరకాలుగా కృషి చేస్తామన్నారు.
40కి చేరిన మృతుల సంఖ్య
సారణ్ జిల్లా ఛప్రా ప్రాంతంలోని ఇసువాపుర్ పోలీస్‌స్టేషను పరిధిలో కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 40కి చేరింది. మరింత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడిరచారు. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని, బాధితులకు పరిహారం అందించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదే విషయంపై అసెంబ్లీలో బుధవారం నాడు ప్రతిపక్షాలు చేసిన నిరసనలపై మండిపడ్డ నీతీశ్ కుమార్ .. ‘తాగి సభకు వచ్చారా..?’ అని విపక్షాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.