మచిలీపట్నం సెప్టెంబర్ 29 ఆంధ్ర పత్రిక.
కృష్ణాజిల్లాలో వైయస్సార్ వాహన మిత్ర పథకం ఐదవ విడత ఆర్థిక సహాయం 10,609 మంది లబ్ధిదారులకు రూ.10.60 కోట్లు..
ఏ కుటుంబం అయితే, ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాల్లోని నగదు మొత్తాన్ని వృధా చేయక, ఆ సొమ్మును ఫలవంతంగా ఉపయోగించుకుంటుందో వారు తప్పక అభివృద్ధిలోనికి వస్తారని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.
జిల్లాస్థాయిలో వైయస్సార్ వాహన మిత్ర ఐదవ విడత కార్యక్రమం కలెక్టరెట్ లోని స్పందన సమావేశపు మందిరంలో కృష్ణాజిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, గత ఏడాది తాను విశాఖపట్నంలో ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పనిచేసినప్పుడు వైఎస్సార్ వాహన మిత్ర నాలుగవ విడత కార్యక్రమంలో పాల్గొన్నట్లు జ్ఞాపకం చేసుకున్నారు ఎంతో గొప్ప కార్యక్రమాన్ని 2019 లో గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించారని, ఆటో డ్రైవర్లు, క్యాబ్ , మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు రూ. 10 వేలు ఇస్తూ పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఐదవ విడత ఆర్థిక సహాయాన్న విజయవాడ విద్యాధరపురంలో బటన్ నొక్కి విడుదల చేయనున్నారని తెలిపారు. తెలిపారు.
కుటుంబ అవసరాలకు లేదా వేరే ఇతర ఖర్చులకు వైయస్సార్ వాహన మిత్ర మొత్తాన్ని ఖర్చు పెడితే ఇది మిగులుగా ఏమాత్రం కనబడదని, ఆ నగదును సక్రమంగా వినియోగిస్తూ ఎప్పటికప్పుడు ట్రాన్స్ పోర్ట్ రెగ్యులైజేషన్స్, సమయానికి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడం, అలాగే వెహికల్ ఫిట్నెస్ సక్రమంగా నిర్వహించుకుంటే, ప్రభుత్వం అందించే వైయస్సార్ వాహన మిత్ర పథకం తాలూకా పదివేల రూపాయలు మిగులుగా కనపడతాయని, వాహనం సరిగా ఉంటే జరిమానాలు చెల్లించే పరిస్థితి సైతం తగ్గిపోతుందన్నారు.
కృష్ణాజిల్లాలో వైయస్సార్ వాహన మిత్ర పథకం ఐదవ విడత ఆర్థిక సహాయం 10,609 మంది లబ్ధిదారులకు రూ.10.60 కోట్లు ఖాతాలకు జమచేయడం జరుగుతుందని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. అనంతరం లబ్దిదారులకు అతిధులతో కలిసి నమూనా చెక్కును, గౌరవ ముఖ్యమంత్రి సంతకంతో పంపిన సందేశం పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
2019 అక్టోబర్ 4న ప్రవేశపెట్టిన ఈ పథకం క్రింద ఉమ్మడి జిల్లాలో 2019-20సం.లో 26,701 మంది లబ్ధిదారులకు రూ.28.70 కోట్లు, 2020-21లో కోవిడ్ పరిస్థితి కారణంగా లబ్ధిదారులకు జీవనోపాది కోల్పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని 4 నెలలు ముందుగానే 29,965 మందికి రూ.29.97 కోట్లు,2021-22లో 27,165 మంది లబ్ధిదారులకు రూ.27.16 కోట్లు అందజేయడం జరిగింది. నాలుగో విడతగా 2022-23 సం.లో వాహన మిత్ర పథకం ద్వారా 10,292 మందికి రూ.10.29 కోట్లు, ఐదవ విడతగా 2023-24 సం.లో వాహన మిత్ర పథకం ద్వారా 10,607 మంది లబ్ధిదారులకు రూ.10.60 కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వివరించారు.
అనంతరం మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, వైయస్సార్ వాహన మిత్ర ఐదవ విడతగా నేడు విజయవాడ విద్యాధరపురంలో బటన్ నొక్కి రాష్ట్రంలో 2,75,931 నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ.275.93 కోట్ల ఆర్థిక సాయం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో విడిదల చేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసించని గొప్ప నిర్ణయాలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ శీలం భారతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, డిఆర్ డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ఆర్ కె ప్రసాద్, డి టి వో సీతాపతి రావు, ఏ.వో. కవిత మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి. పెద్దిరాజు పలువురు ఆటో, టాక్సీ డ్రైవర్లు, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైయస్సార్ వాహన మిత్ర లబ్ధిదారుల అభిప్రాయాలు.
1. పెనుమాక విజయరత్నరాజు, ఆటో డ్రైవర్, రైలు పేట మచిలీపట్నం.
గత ఐదేళ్ల నుంచి సంవత్సరానికి 10 వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు తనకు 50 వేల రూపాయలు ప్రభుత్వం అందించిందని పెనుమాక విజయరత్నరాజు తెలిపాడు. గత 30 సంవత్సరాలుగా అద్దె ఆటో నడుపుకుంటూ, పదేళ్ల క్రితం తన భార్య నగలు కుడువపెట్టి లక్ష రూపాయలు రుణంకు తోడు ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి మరో లక్ష రూపాయలు అప్పు తీసుకొని సొంతంగా ఆటో కొనుక్కున్నానని చెప్పాడు. ఏడు సంవత్సరాలు గడిచేసరికి తన ఆటో బాగా పాడైపోయిందని, కనీసం ఆటో కి ఇన్సూరెన్స్ కట్టలేని పరిస్థితిలో ఇబ్బంది పడ్డానని విజయ రత్నరాజు చెప్పాడు. 2019లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభించారని తొలిసారిగా తనకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిందని దాంతో ఆటోకు ఇన్సూరెన్స్ చెల్లించినట్లు చెప్పాడు. గతంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ లకు భయపడి సందుల్లో మాత్రమే తిరిగేవారమని, జగనన్న ప్రస్తుతం ఇచ్చిన డబ్బులతో లైసెన్సులు రెన్యువల్ చేయించుకోవడం ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ లు పొల్యూషన్ సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా కట్టుకుంటూ ఇప్పుడు ధైర్యంగా ప్రధాన రహదారుల తిరుగుతున్నట్లు విజయ రత్నరాజు తెలిపాడు. తనలాంటి పేద మధ్యతరగతి ఆటో డ్రైవర్ల సమస్యలను గుర్తించి ప్రతి ఏడాది ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి కి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
2. మద్దంశెట్టి గంగయ్య పొట్లపాలెం, మచిలీపట్నం
వైయస్సార్ వాహన మిత్ర పథకం తనలాంటి ఎందరో ఆటో డ్రైవర్లకు టాక్సీ నడుపుకునే వారికి ఎంతో ఆసరాగా ఉంటుందని మచిలీపట్నం మండలం పొట్లపాలెం చెందిన మద్దంశెట్టి గంగయ్య, సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఆటో లైసెన్సు, ఇన్సూరెన్స్, ఆటో రిపేర్లు పట్ల కొంత నిర్లక్ష్యం ఇచ్చామని, తమకు అన్నం పెట్టే ఆటోకు సరైన నిర్వహణ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు సైతం జరిగేవని, జగనన్న ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రతి ఏడాది పదివేల రూపాయలు తమకు అందించారని, ఆ సొమ్ము ఆటో నిర్వహణ కోసమే ఖర్చు పెట్టామని దీంతో రోడ్డు ప్రమాదాలు క్రమేపీ తగ్గిపోయాయని, ఏ చిన్న రిపేరు వచ్చిన తక్షణమే బాగు చేయించుకుంటున్నామని గంగయ్య తెలిపారు. ముఖ్యమంత్రి తమలాంటి సాదాసీదా బడుగు జీవులను సైతం గుర్తుపెట్టుకుని వాహన మిత్ర సహాయం చేయడం చాలా బాగుందని గంగయ్య సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.