నేడు (ఆగస్టు 19) దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ పండుగ అంటే సోదర సోదరీమణులకు ఎంతో ఇష్టం. రాఖీ పండుగ వస్తే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఉన్న ప్రతి ఇళ్లు సందడిగా ఉంటుంది.
చాలామంది ఈ పండుగకు దూర ప్రయాణాలను సైతం లెక్క చేయకుండా, రాఖీ కట్టేందుకు వెళ్తుంటారు.
సొంత అన్నాతమ్ముళ్లకే కాకుండా వరుసకు అన్న లేదా తమ్ముడు అయిన ప్రతీ వారికీ రాఖీని కడుతుంటారు. ఈ పండుగను భారతీయులంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. కానీ దేశంలోన ఓ ప్రాంతంలో మాత్రం గడిచిన 65ఏళ్లుగా రాఖీ పండుగను జరుపుకోవడం లేదు. ఆ ఊర్లో రాఖీ పండుగ నిషేధమట. రాఖీ పండుగ ఒకవేళ నిర్వహిస్తే విషాదాలు జరుగుతాయని అక్కడివారు అంటున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటో అక్కడి ఈ పరిస్థితికి కారణమేంటో తెలుసుకుందాం పదండి.
ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలోని ప్రజలు గడిచిన 65 సంవత్సరాల నుంచి రాఖీ పండుగ చేసుకోవడం లేదు. దీని వెనుక ఉన్న కథను ఆ గ్రామస్థులు చెబుతుంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది. యూపీలోని వజీరాగంజ్ పంచాయతీలోని జగత్పూర్వలో రాఖీ పండుగ నిర్వహించడం లేదు. 1955లో రాఖీ పండుగ రోజు గ్రామంలోని ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
దీంతో ఈ పండుగ కీడుకు సంకేతమని భావించి అక్కడివారు రాఖీ పండుగను చేసుకోవడం అప్పటినుంచి ఆపేశారు. అయితే దశాబ్దం కిందట ఆ గ్రామంలో రాఖీ పౌర్ణమి నిర్వహించాలనుకున్నారు. కానీ, ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊర్లో అలాంటి సంఘటనే మరొకటి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి రాఖీ పండుగకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాఖీ పండుగ తమ ఊరికి, ప్రజలకు మంచిది కాదనే నిర్ణయానికి వచ్చారు ఆ గ్రామస్తులు. అప్పటినుంచి ఇప్పటివరకూ అక్కడ రాఖీలు కట్టుకోరు.
రాఖీ అంటే భయపడిపోతారు..
ఇవే కాదు. యూపీలోని మరికొన్ని గ్రామాలు కూడా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నాయి. సంభాల్ జిల్లా బైనీపూర్ చాక్లో రాఖీ పండుగ జరపకపోవడంతో ఓ వింత ఆచారం ఉంది. రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే, ఆస్తులన్నీ కోల్పోయి, ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడివారు భయపడుతుంటారు. అసలు విషయం ఏమిటంటే. అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టిన అనంతరం సోదరులు బహుమతిగా ఆస్తులు అడిగేవారట.
అలా వారు ఆస్తులన్నీ ఇచ్చేసి ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోయేవారట. అలా ఆస్తి ఇచ్చుకుంటూ పోవడంతో అన్నాతమ్ముళ్లందరూ డబ్బులేని వాళ్లు అయిపోయేవారు. దీంతో ఇక, అక్కడ రాఖీ పండుగను నిషేదించుకున్నారు. అందుకే, ఇక్కడివారు రాఖీ పండుగ అంటే భయపడిపోతారట.. ఇదే రాష్ట్రంలోని గున్నార్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో కూడా ఇదే వైనం కనిపిస్తోంది. దీంతో పాటు ధౌలానా గ్రామంలో కూడా రాఖీ పండుగ నిషేధం, ఇలా యూపీలోని పలుప్రాంతాల్లో ఈ పండుగను చాలా ఏళ్లనుంచి చేసుకోవడం లేదు.