ఆ యువ మంత్రి వచ్చే ఎన్నికలలో ఎక్కడినుంచి పోటీ చేస్తారన్నదానిపై ఉత్తరాంధ్రలో పెద్ద చర్చే జరుగుతోంది. తన నియోజకవర్గం కాకపోతే జిల్లాలో మరో నియోజకవర్గానికి వెళ్తారా, లేదంటే అదే లోక్‌సభ స్థానంనుంచి పోటీ చేస్తారా అన్నదే ప్రధాన చర్చ. మార్పు ఖాయమని ఫిక్సయిపోయిన నేతలు ఆయన సిట్టింగ్ సీటుకోసం నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారు. ఇంతకీ మంత్రి ఎందుకు సీటు మార్చాలనుకుంటున్నారు. అదే జరిగితే అక్కడ అవకాశం ఎవరికి?
యువమంత్రిగా కేబినెట్లో ఆయనకో గుర్తింపు ఉంది. పార్టీ గొంతుని బలంగా వినిపించే స్పోక్స్పర్సన్స్లో ముందుంటారు ఉత్తరాంధ్ర మినిస్టర్. అధిష్ఠానం దగ్గర మంచి మార్కులు కొట్టేసిన గుడివాడ అమర్నాథ్.. 2024లో మళ్లీ అనకాపల్లి అసెంబ్లీ సీటు నుంచి పోటీచేయరన్న బలమైన ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎమ్మెల్యేలెవరూ అంత తొందరగా నియోజకవర్గం మారరు. పైగా మంత్రి హోదా కూడా ఉండటంతో నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకుని అక్కడినుంచే రాజకీయం చేస్తారు. అమర్ కూడా అనకాపల్లిపై పట్టుబిగిస్తున్నా వచ్చే ఎన్నికల్లో అక్కడినుంచి పోటీచేయరన్న చర్చ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా మళ్లీ అనకాపల్లి నుంచే పోటీ చేస్తారా లేదా అన్న చర్చ గుడివాడ అమర్నాథ్కి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉందట. అయినా పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో మళ్లీ తానే పోటీచేస్తానని అమర్ చెబుతున్నా.. మార్పు తథ్యంగా కనిపిస్తోంది. అయితే అమర్ సీటు ఎందుకు మారతారన్న పాయింట్ దగ్గర ఆగితే.. అనకాపల్లి జిల్లాలో సామాజిక సమీకరణాలే ప్రధాన కారణమంటున్నారు. జిల్లాలో కాపు, తర్వాత గవర, వెలమ, వాటి తర్వాత కొన్ని బీసీ కులాలు కీలకంగా ఉన్నాయి. అనకాపల్లి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో కాపు, గవర సామాజికవర్గాల నేతల్ని చెరో సీటునుంచి నిలబెట్టే ఆనవాయితీ ఉంది. ఈసారి అనకాపల్లి నియోజకవర్గాన్ని గవరలకు కేటాయించి ఎంపీగా బలమైన కాపు నేతని పెడితే ఏడు అసెంబ్లీనియోజకవర్గాలపైన ప్రభావం ఉంటుందన్న లెక్కల్లో ఉందట వైసీపీ.
అనకాపల్లి ఎమ్మెల్యేగా కాపు నేత అమర్నాథ్ ఉంటే, ఎంపీగా గవర సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సత్యవతి ఉన్నారు. డాక్టర్ సత్యవతి గతంలో రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోవడం, ఎంపీగా గెలిచాక కూడా నాలుగేళ్లలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడంతో.. ఈసారి కాపు నేతని ఈసారి ఎంపీగా బరిలోకి దించాలన్న వ్యూహంతో ఉంది అధికారపార్టీ. అధిష్ఠానం ఆలోచనకు తోడు అమర్నాథ్కి కూడా ఎంపీగా వెళ్లాలన్న ఆలోచన ఉందంటున్నారు. అందుకే 2014లో కూడా అనకాపల్లి ఎంపీగానే పోటీచేశారు గుడివాడ. ఈసారి కూడా అదే జరుగుతుందన్న అంచనాతో అనకాపల్లి అసెంబ్లీ సీటుపై కన్నేశారట కొందరు సీనియర్లు. గవర వర్గానికి చెందిన దాడి వీరభద్రరావు సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు.2014లో కుమారుడు దాడి రత్నాకర్ విశాఖ వెస్ట్ నుంచి ఓడిపోవడం, 2019లో అనకాపల్లి ఎంపీగా పోటీకి వీరభద్రరావు ఆసక్తిచూపకపోవటంతో ఈసారి అనకాపల్లిలో గెలిచి మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావాలనుకుంటోంది దాడి ఫ్యామిలీ.
అనకాపల్లి అసెంబ్లీ సీటుపై దాడి వీరభద్రరావు ఆసక్తిగా ఉన్నా ఆయనకు మంత్రి అమర్‌తో విభేదాలున్నాయి. అయితే గుడివాడతో ఆధిపత్య పోరు ఉండటంతో పార్టీ దాడి వైపు ఎంతవరకు మొగ్గుతుందన్న అనుమానాలు కొందరికున్నాయి. అమర్నాథ్ని పార్లమెంట్‌కి పోటీచేయిస్తే ..సిట్టింగ్ ఎంపీ సత్యవతిని అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న ఆలోచన కూడా అధిష్ఠానానికి ఉందంటున్నారు. మరోవైపు తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని కోరుతున్నారట జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొడ్డేడ ప్రసాద్. మంత్రి అమర్ మాత్రం దాడి వీరభద్రరావుకు తప్ప ఎవరికిచ్చినా తన సహకారం ఉంటుందని చెబుతున్నారట. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరన్న చర్చతో అనకాపల్లిలో కేంద్రీకృతమైంది ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయం.