వినేశ్ ఫొగాట్ భారత స్టార్ రెజ్లర్. ఇప్పుడు పొలిటికల్ స్టార్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన లక్కును పరీక్షించుకుంటున్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్దిగా జులానా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. తాజాగా నామినేషన్ దాఖలు చేసిన వినేశ్ ఫొగాట్ తన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులతో పాటుగా అప్పుల వివరాలను వెల్లడించారు.
వివేశ్ ఆస్తుల చిట్టా
వినేశ్ ఫొగాట్ ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.4కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. సోనిపత్లో రూ.2కోట్లు విలువ చేసే స్థిరాస్తి ఉందన్నారు. ఇక ఆమె వద్ద అందులో మూడు కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో రూ.35 లక్షల విలువ చేసే వోల్వో ఎక్స్సీ 60, రూ.12 లక్షల విలువ చేసే హ్యుందాయ్ క్రెటా, రూ.17లక్షల గల టొయోటా ఇన్నోవా కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్నోవా కోసం రూ.13 లక్షల అప్పు తీసుకున్నానని..అయితే, ప్రస్తుతం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపారు.
అప్పులు – డిపాజిట్లు
వినేశ్ తన భర్త సోమ్వీర్ రాఠీ పేరిట రూ.19లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో కారు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. వీటితో పాటుగా తన చేతిలో ప్రస్తుతం రూ.1.95లక్షల నగదు ఉన్నట్లు వినేశ్ తెలిపారు. మూడు బ్యాంకుల్లో దాదాపు రూ.39లక్షలు డిపాజిట్లు ఉండగా, ఆమె భర్తకు మరో రూ.30లక్షలకు మేర బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని అన్నారు. 35 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు కూడా తన వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.2.74లక్షలుగా వెల్లడించారు.
హోరా హోరీ పోరు
అదే విధంగా తన భర్తకు 28 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి ఉన్నట్లు తెలిపారు. మద్రాసులో వినేశ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినట్లు తన అఫిడవిట్లో వివరించారు. ఇక..అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన వినేశ్ కు ముందుగానే టికెట్ పైన హామీ దక్కింది. జాట్ వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గంతో పాటుగా వినేశ్ సొంత నియోజకవర్గం అయిన జులాన్ ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఇక్కడ బీజేపీ నుంచి యోగేశ్ బైరాగి..ఆప్ నుంచి మహిళా రెజ్లర్ కవితా దలాల్ పోటీ చేస్తున్నారు. దీంతో, వినేశ్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం సాధిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.