ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కబ్జా చేసినట్టుగా అధికారులు నిర్థారించిన భూములను రీఅసైన్ చేస్తూ బుధవారం పట్టాలను పంపిణీ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో మొత్తం 85.19 ఎకరాల భూములను 65 మంది రైతులకు అధికారులు రీఅసైన్ చేశారు. అయితే గతేడాది డిసెంబరు 6న జిల్లా కలెక్టర్ హరీశ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… జమున హేచరీస్ 70.33 ఎకరాలను కబ్జా చేసినట్లు పేర్కొన్నారు. కానీ, బుధవారం 85.19 ఎకరాల భూమిని అసైన్డ్‌దారులకు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, మాసాయిపేట తహసీల్దార్ మాలతీ రీఅసైన్డ్ పట్టాలను భూముల వద్దనే రైతులకు అందజేశారు. కాగా… పట్టాల పంపిణీ జరిగే వరకు అధికారులు సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. భూముల వద్దకు రెవెన్యూ అధికారులు ఉదయమే చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ రమేష్… తూప్రాన్ ఆర్డీవో కార్యాలయం నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
నిర్మాణాలున్న భూములపై పట్టాల జారీ
అచ్చంపేట శివారు సర్వే నంబర్ 130లో 18.35 ఎకరాలు ఉండగా, అందులో పట్టాభూమిగా పేర్కొన్న 3 ఎకరాలను 2019లో రిజిస్ట్రేషన్ ద్వారా జమున హేచరీస్ కొనుగోలు చేసింది. అందులో పౌలీ్ట్ర షెడ్లు, రోడ్ల నిర్మాణాలు చేపట్టింది. అయితే 18.35 ఎకరాల్లో 15.29 ఎకరాలను 12 మంది రైతులకు రీఅసైన్ చేస్తూ పట్టాలు ఇచ్చారు. షెడ్లు ఉన్న భూమిని కూడా అధికారులు సీలింగ్ భూమిలో భాగంగా తేల్చారు. దీంతో షెడ్ల స్థలాలపై రైతుల పేరిట పట్టాలను మంజూరుచేశారు. పట్టాల జారీ అనంతరం షెడ్లను కూల్చేందుకు రెండు జేసీబీ యంత్రాలను అచ్చంపేటకు తెప్పించారు. అయితే, నిర్మాణాలు కూల్చితే ఇబ్బందులు ఎదురవుతాయని ఉన్నతాధికారులు చెప్పడంతో వదిలేశారు. కోర్టు అనుమతి తీసుకొని నిర్మాణాలను కూల్చివేస్తామని ఓ రెవెన్యూ అధికారి వివరించారు. అలాగే అచ్చంపేట సర్వే నంబర్ 81లో జమున హేచరీస్ 5.36 ఎకరాలను పట్టా భూమిగా రిజిస్ట్రేషన్ చేసుకోగా… దాన్ని కూడా సీలింగ్‌గా గుర్తించి పంపిణీ చేశారు. అదేవిధంగా… సర్వే నంబర్లు 77, 78, 79, 80, 81, 82లలో కొనుగోలు చేసిన 5.36 ఎకరాల పట్టాభూమికి రోడ్డేయగా… ఆ నంబర్లలోని భూమినంతా కబ్జా చేసినట్టు అధికారులు చూపించారు. కాగా… హకీంపేటలోని సర్వే నంబర్ 97లో ఒక ఎకరం భూమిలో పౌలీ్ట్ర వ్యర్థాలను వేయడంతో, ఆ భూమిని కూడా కబ్జాగా తేల్చారు.
65 మందికి 85.19 ఎకరాల పంపిణీ
అచ్చంపేట, హకీంపేటలో బుధవారం మొత్తం 85.19 ఎకరాల అసైన్డ్ భూములను 65 మంది రైతులకు రీఅసైన్ చేశారు. ఇందులో ఎస్సీలు 9మంది, ఎస్టీలు ముగ్గురు, బీసీలు 53మంది ఉన్నారు. అచ్చంపేటలో సర్వే నంబర్ 77లో ఆరుగురు రైతులకు 7 ఎకరాలను పంపిణీ చేశారు. అలాగే సర్వే నంబర్ 78లో 10 మంది రైతులకు 13.02 ఎకరాలు, సర్వే నంబర్ 79లో 9మంది రైతులకు 11.03 ఎకరాలు రీఅసైన్ చేశారు. అదేవిధంగా సర్వే నంబర్ 80లో 12 మంది రైతులకు 16.26 ఎకరాలు, సర్వే నంబర్ 81లో 8 మంది రైతులకు 10.30 ఎకరాలు పంపిణీ చేశారు. వీటితోపాటు సర్వే నంబర్ 82లో ఐదుగురు రైతులకు 10.09 ఎకరాలు, సర్వే నంబర్ 130లో 12 మందికి 15.29 ఎకరాలు, అలాగే హకీంపేటలో సర్వేనంబరు 97లో ముగ్గురికి ఎకరం భూమి పంపిణీ చేశారు.
అధికార పార్టీ నేతల హంగామా
కాగా… పట్టాలు పంపిణీ చేసేందుకు వెళ్లిన పలువురు అధికార పార్టీ నేతలు జమున హేచరీస్ కంపెనీ వద్ద హంగామా చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మధన్‌రెడ్డి తమ అనుచరులతో కలిసి ఉదయం 11 గంటలకు భూముల వద్దకు చేరుకున్నారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీ గేటు వద్దకు చేరుకుని వాహనాన్ని నిలపగా.. అదే సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి కంపెనీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కంపెనీ గేటును తెరిచి లోపలికి వెళ్లేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే కంపెనీ ప్రతినిధి మరోమార్గం గుండా వెళ్లాలని తెలియజేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కంపెనీ కబ్జా చేసి రోడ్డు వేసినట్లుగా అధికారులు గతంలో గుర్తించిన దారి గుండా కంపెనీలోకి చేరుకున్నారు. అదే రోడ్డుపైనే ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు నిల్చొని రైతులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద రైతుల భూములను కబ్జా చేసి జమున హేచరీస్ పేరుతో దుర్మార్గం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు అక్రమంగా భూములను గుంజుకుంటున్నారని, హైదరాబాద్‌లో నిర్వహించే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాన మంత్రిని రైతులు ఈ విషయంపై ప్రశ్నించాలని కోరారు. పట్టాల పంపిణీ పూర్తవగానే ఎంపీ, ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. షెడ్ల వద్ద నుంచి రైతులను, ప్రజలను పోలీసులు బయటకు పంపించారు. కాగా… రీఅసైన్డ్ పట్టాల పంపిణీ సందర్భంగా అడుగడుగునా పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. మాసాయిపేట నుంచి వెళ్లే మార్గంలో రెండు చెక్‌పోస్టులు, బారికేడ్లను ఏర్పాటుచేశారు. అలాగే… తూప్రాన్‌లో నలుగురు; మాసాయిపేట, చేగుంట మండలాల పరిధిలో 14 మంది బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఈటల రాజేందర్ ఫోన్లో పరామర్శించారు. పట్టాలు పొందిన అచ్చంపేట, హకీంపేట రైతులు.. సాగుకు అనుకూలంగా ఉన్న కొంత భూమిని అప్పటికప్పుడే ట్రాక్టర్లతో దున్ని విత్తనాలను వెదజల్లారు.