చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా బద్రినాథ్ ధామ్ (Badrinath Dham)కు భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు. గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో భక్తులు బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు అధికారులు తాజాగా తెలిపారు.
ఆలయం తెరిచిన నెలరోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చెప్పారు. గతేడాది తొలి నెల రోజుల్లో 4.5 లక్షల మంది బద్రినాథ్ ధామ్‌ను సందర్శించినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే 50 వేల మంది భక్తులు అదనంగా దర్శించుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కిషోర్ పన్వార్ మాట్లాడుతూ.. ‘చార్ధామ్ యాత్రకు ఇప్పటి వరకూ 19 లక్షల మంది భక్తులు వచ్చారు. ఆలయం తెరిచిన నెలలోపే బద్రినాథ్ ధామ్‌ను 5 లక్షల మంది విజిట్ చేసి.. బద్రి విశాల్ స్వామి (Lord Badri Vishal)ని దర్శించుకున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారని భావిస్తున్నాం’ అని తెలిపారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్ ఆలయ తలుపులు గత నెల 12వ తేదీన తెరుచుకున్న విషయం తెలిసిందే. శీతాకాల సీజన్లో మూసివేసిన ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. చార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల్లో అక్షయ తృతీయ సందర్భంగా పూజలు చేసి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు చార్ధామ్ యాత్రకు పోటెత్తుతున్నారు.