తిరుమల,సెప్టెంబరు 24 (ఆంధ్రపత్రిక): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో విభాగాల వారీగా చేపట్టిన ఏర్పాట్లపై టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈ సమీక్ష జరిగింది. జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భక్తుల సమక్షంలో వాహనసేవలు జరుగనున్నాయని, ప్రతి ఉద్యోగీ బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని కోరారు. విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ -2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఇతర టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సెప్టెంబరు 28న ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ఆనుకుని నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ఈవో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.