అన్నదాతల కష్టాలను పట్టించుకోండి
- వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవదు.. గెలవనివ్వం
- వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు జరుగుతాయి..
- నలుగురు బీసీలకు మంత్రి పదవులు ఇస్తేనే బీసీ సాధికారతా?
- రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదు
- రాష్ట్రంలో అన్నదాతల కష్టాలను పట్టించుకునే అధికారులు లేరు
- రాష్ట్రంలో మరోసారి వైకాపా ప్రభుత్వం వస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే.
- భాజపా, తెదేపాకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు
- జనసేన అధినేత పవన్ కల్యాణ్
పల్నాడు,డిసెంబరు 18 (ఆంధ్రపత్రిక): రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదని చెప్పారు.రాష్ట్రంలో అన్నదాతల కష్టాలను పట్టించుకునే అధికారులు లేరని.. ప్రజలను బెదిరించటానికి, ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికి వస్తారని ఆయన మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న పవన్.. నష్టపోయిన కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘’రాష్ట్రంలో వైకాపా నాయకులు చేసే దోపిడీ ఎంత? ఎన్నికలు దగ్గరికి వచ్చాయి కాబట్టి అవినీతికి వైకాపా హాలీడే ప్రకటించింది. నన్ను వారాంతపు పొలిటీషియన్ అంటున్నారు. కాపు నాయకులతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారు. నేనెలా తిరుగుతానో చూస్తామని వైకాపా గాడిదలు ఓండ్ర పెడుతున్నాయి. వారానికి ఒక్కరోజు వస్తేనే వైకాపా వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. నాకు తాతలు సంపాదించి పెట్టిన రూ.వేల కోట్లు లేవు. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు నా దగ్గర లేదు. నా కష్టార్జితంతో రైతులకు సాయం చేస్తున్నాను’’ అని పవన్ తెలిపారు.
అంబటి కాపుల గుండెల్లో కుంపటి..
ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అవినీతి చేస్తున్నాడని అంబటిని ఉద్దేశించి ఆయన విమర్శలు గుప్పించారు. ‘’అంబటి కాపుల గుండెల్లో కుంపటి. పోలవరం పూర్తి చేయటం తెలియని ఆయన నీటిపారుదల మంత్రి. అంబటి, వైకాపా నాయకులవి ఉత్తర కుమార ప్రగల్భాలు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవట్లేదు. గెలవనివ్వం. వైకాపా అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత మీది. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు ఈరోజుకీ కట్టుబడి ఉన్నా. భాజపా, తెదేపాకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు. వైకాపా నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమిషన్లు కొట్టే రకం కాదు. వైకాపా ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రోడ్ల మీదకు వచ్చి పోరాడుతున్నా. అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తా’’ అని పవన్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు జరుగుతాయి..
‘’ప్రభుత్వ వ్యవస్థలను ఇకముందూ వైకాపా వాడుకుంటుంది. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లాఠీదెబ్బలు తినేందుకైనా.. జైలుకు వెళ్లేందుకైనా.. నేను సిద్ధం. వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు జరుగుతాయి. ఇటీవల మాచర్లలో పార్టీ కార్యాలయం తగలబెట్టడం చూశాం కదా. రాష్ట్రంలో మరోసారి వైకాపా ప్రభుత్వం వస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే. ఎన్నికల వ్యూహం నాకు వదిలేయండి.. నేను చూసుకుంటా. జనసేనను అధికారం దిశగా నడిపించే బాధ్యత మాది. అధికారం చూడని కులాలను అందలం ఎక్కించటమే మా లక్ష్యం. అధికారం చూసిన కులాలపై నాకు వ్యతిరేకత లేదు. 2014లాగే మేం కూటమిలా ఉంటే వైకాపా గెలిచేది కాదు. నలుగురు బీసీలకు మంత్రి పదవులు ఇస్తేనే బీసీ సాధికారతా? బీసీల నుంచి ఎందరు పారిశ్రామికవేత్తలు వచ్చారు? బీసీ నాయకుల వల్లే బీసీలు, కొందరు కాపు నేతల వల్లే కాపులు వెనకబడుతున్నారు’’ అని పవన్ తెలిపారు.