చిరు, బాలయ్యలపై శేఖర్ మాస్టార్ ప్రశంసలు
డిసెంబర్ 27 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌లలో శేఖర్ మాస్టర్ ఒకరు. చిన్న హీరోల దగ్గర్నుంచీ పెద్ద స్టార్స్ వరకు అందరితోనూ స్టెప్స్ వేయిస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే సంక్రాంతి తనకింకా పెద్ద పండుగ అంటున్నాడు. తను కొరియోగ్రఫీ చేసిన రెండు పెద్ద సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ ’ఈ సినిమాలకు వర్క్ చేస్తున్నప్పుడు రెండూ పండక్కి వస్తాయని తెలీదు. అందుకే ఎలాంటి ప్రెజర్ లేకుండా పని చేశా.ఇప్పుడు రెండు సినిమాల నుంచి రోజుకో పాట రిలీజ్ అవడం ఆనందంగా ఉందన్నారు. ’వాల్తేరు వీరయ్య’లో అన్ని పాటలకు కొరియోగ్రఫీ చేశా. అలాగే ’వీరసింహా రెడ్డి’లో రెండు పాటలు చేశాను. చిరు, బాలయ్య.. ఇద్దరిలో ఉన్న యూనిక్ క్వాలిటీ డెడికేషన్. ఒక మూమెంట్ పూర్తయ్యేవరకూ రిలాక్స్ అవ్వరు. ఆ డెడికేషన్ ఇద్దరిలో చూశా. అలాగే టైమింగ్ సెన్స్ కూడా. వారిద్దరి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయాలివి. ’వాల్తేరు వీరయ్య’ మెలోడి పాట కోసం ఫారిన్ వెళ్లాం. అక్కడ మైనస్ 10 డిగ్రీల చలిలో చిరంజీవి గారు, శ్రుతిహాసన్ డ్యాన్స్ చేశారు. అలాగే ’వీరసింహారెడ్డి’లోని సుగుణ సుందరి పాట కోసం టర్కీ వెళ్లాం. అక్కడ విపరీతమైన ఎండలో షూట్ చేశాం. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ఇందులో బాలకృష్ణ చేసిన బెల్ట్, నాడ స్టెప్‌ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.