- 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
- దుర్గగుడి ఈవో దర్భముళ్ళ భ్రమరాంబ వెల్లడి
విజయవాడ సెంట్రల్, సెప్టెంబరు 23, (ఆంధపత్రిక): దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి ఈఓ దర్భముళ్ళ భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహామండపంలోని 6వ అంతస్తులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈఓ భ్రమరాంబ మాట్లాడుతూ… ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. కోఆర్డినేషన్ కమిటి మీటింగ్‌లో అన్ని సూచనలు పరిగణంలోకి తీసుకొని ఏర్పాట్లు చేశామన్నారు. చిన్న చిన్న పనులు మినహా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ఇంద్రకీలాద్రి విద్యుత్తు కాంతులు శోభాయమానంగా విరజిమ్మేలా ప్రత్యేకంగా అలంకరణ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో 21 లక్షల ప్రసాదాలు సిద్ధం చేస్స్తున్నట్లు చెప్పారు. భక్తులకు విశ్రాంతి పందిళ్ళు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఉచిత, రూ.100, రూ.300 వరుస మార్గాలతో పాటు ప్రముఖులకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశామని ఈవో అన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లే మార్గంలో ఎక్కడా ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గతంలో 300 జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తే ఆ సంఖ్యను ఈ ఏడాది 800 వరకు పెంచామని చెప్పారు. వృద్దులు, వికలాంగులకు బ్యాటరీ కార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది అన్నదానం నిర్వహించడంలేదని, భక్తులకు భోజన పొట్లాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. అంతరాలయం దర్శనానికి అనుమతి లేదన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు 250 మందిని నపియమించినట్లు చెప్పారు. మహామండపానికి సమీపంలో ఉన్న గోశాల వద్ద సాంస్క్రతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. ప్రతిరోజూ తెల్లవారుజాము 3గంటలు నుండి రాత్రి 10:30 గంటలు వరకు అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. తొలిరోజున అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9గంటలు నుండి భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు. ఖడ్గమాల అర్చన అంతరాలయంలో కాకుండా మహా మండపంలోని 6వ అంతస్తులో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అమ్మవారి దసరా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.