మచిలీపట్నం డిసెంబర్ 6 ఆంధ్ర పత్రిక.
మిచౌంగ్ తుఫాను వలన జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కి తెలిపారు.
బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయం నుండి తుఫాను వలన సంభవించిన నష్టాలు, తీసుకున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ తో సహా అందరూ సమర్థవంతంగా మిచాంగ్ తుఫానును ఎదుర్కున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల ని , సిబ్బంది ని అభినందించారు.
ఈ సందర్భంగా నగరంలోని జిల్లా కలెక్టరేట్ విసీ హాల్ నుండి పి. రాజాబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టడంతో జిల్లాలో మిచౌంగ్ తుఫాను వలన ఎటువంటి మానవ నష్టం గాని, పశువుల నష్టం కాని జరగలేదని రాజాబాబు వివరించారు.
జిల్లాలో తుఫాను సహాయక చర్యల కోసం రెండు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విడుదల చేయడంతో, ఆ మొత్తాన్ని వెంటనే మండలాలకు పంపించి ఖర్చు చేసామని ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కలగలేదని కలెక్టర్ చెప్పారు.జిల్లాలో 88 ఇళ్లు పాక్షికంగాను, పూర్తిగాను దెబ్బతిన్నాయన్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని 831 కుటుంబాలను వారు నివసిస్తున్న ప్రాంతాలనుండి ఖాళీ చేయించి, సురక్షితంగా ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు.మరో 100 ఇళ్ళకు వర్షపు నీరు చుట్టుముట్టిందని వారి పట్ల ప్రత్యేక జాగ్రత్త వహించి ఆహారము సరఫరా చేశామన్నారు.
విపరీతమైన గాలులు వీచినందువలన విద్యుత్ అంతరాయం కలిగిందని, మొత్తం 29 సబ్ స్టేషన్ల పరిధిలో 199 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని 25 ట్రాన్స్ఫార్మర్ లు దెబ్బతిన్నాయన్నారు. 52 సంచార బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తక్షణమే దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను, పరికరాలను పునరుద్ధరించే ఏర్పాట్లు చేశామన్నారు. 68 గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే రాత్రింబవళ్లు శ్రమించి వాటిని పునరుద్ధరించామన్నారు.
కొన్ని గ్రామాలకు మంచినీరు అవసరం కావడంతో అక్కడికి ప్రత్యేకంగా ట్యాంకర్లు పంపించి త్రాగునీరు సరఫరా చేశామన్నారు.
జిల్లాలో 36 ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ రహదారులు దెబ్బతిన్నాయని, వాటన్నిటినీ పునరుద్ధరిస్తున్నామని రేపటిలోగా ఎన్యుమరేషన్ చేసి అంచనాల నివేదికను ప్రభుత్వానికిసమర్పిస్తామన్నారు.
జిల్లాలో వరి ధాన్యం దెబ్బతినలేదని, కోత కోసిన 80% ధాన్యాన్ని మిల్లులకు పంపించామని, 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భద్రంగా గోదాములలో ఉందన్నారు.జిల్లాలో ప్రస్తుతం నిలిచి ఉన్న పంటల పైన తుఫాను ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందన్నారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 80 వేల హెక్టార్లలో వరి, మినుము, పత్తి , వేరుశనగ వంటి పంటలకు నీళ్లలో మునిగి నష్టం వాటిల్లిందన్నారు.వ్యవసాయ అధికారులందరినీ ఆ ప్రాంతాలకు పంపించి పంట పొలాల్లోని నీటిని బయటికి తొలగించే ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.
వరి ధాన్యం దెబ్బతినకుండా తేమశాతం పెరగకుండా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామన్నారు.
ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.రెండు రోజుల్లో పంట నష్టం అంచనాల నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు.జిల్లాలో 1150 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది రాత్రనకా, పగలనకా, లంక గ్రామాల్లో ఎంతగానో శ్రమించి అక్కడి వారికి ధైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు చేర్చి ఆదుకున్నారన్నారు. వారి బాగోగులను చూసుకుంటూ నిరంతరం పర్యవేక్షించామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ముఖ్య కమిషనర్ ఎప్పటికప్పుడు సమీక్షించి ఇస్తున్న సూచనలు సలహాలను అనుసరించి తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పోలీసు అధికారి పి. జాషువా, సంయుక్త కలెక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ పెద్దిరోజా, ఆర్డీవో ఎం. వాణి, ధాన్యం సేకరణ ప్రత్యేక అధికారి నాగజ్యోతి,డిపిఓ నాగేశ్వరరావు నాయక్, పశుసంవర్ధక అధికారి శ్రీనివాస నాయక్, ఉద్యాన అధికారి జ్యోతి, పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు, రహదారులు భవనాల అధికారి శ్రీనివాస్, మార్కెటింగ్ అధికారి నిత్యానందం, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.