న్యూఢిల్లీ: కొవాగ్జిన్( Covaxin) టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 30 శాతం మందికి వేర్వేరు అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు ఇటీవల బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఓ రిపోర్టును రిలీజ్ చేసింది.
ఆ నివేదికను స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్‌లో ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ నివేదికపై ఇవాళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ స్పందించారు. కొవాగ్జిన్ టీకా వాడకంపై ప్రచురించిన నివేదిను ఆయన తప్పుపట్టారు. స్టడీ కోసం వాడిన మెథడాలజీ, డిజైన్‌ను విమర్శించారు. జర్నల్‌లో వచ్చిన నివేదిక తప్పుదోవ పట్టించేలా ఉందని ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ వెల్లడించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి, వ్యాక్సిన్ వేసుకోని వారి మధ్య తేడాను ఆ స్టడీ తేల్చలేకపోయిందని భల్ ఆరోపించారు. అందుకే కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌తో ఆ రిపోర్టును అనుసంధానం చేయలేమని ఆయన తెలిపారు.
బీహెచ్‌యూ చేపట్టిన కొవాగ్జిన్ స్టడీకి తాము అనుసంధానం చేయలేదని, ఆ స్టడీ కోసం ఎటువంటి ఆర్థిక సాయం కానీ, సాంకేతిక సాయం కానీ అందించలేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. కొవాగ్జిన్‌పై రిపోర్టు తయారు చేసిన రచయితలకు, ఆ జర్నలి ఎడిటర్‌కు లేఖ రాసినట్లు ఐసీఎంఆర్ డీజీ తెలిపారు. ఐసీఎంఆర్ గుర్తింపు ఇచ్చినట్లు ఉన్న అంశాన్ని ఆ నివేదిక నుంచి తొలగించాలని ఐసీఎంఆర్ డీజీ తన లేఖలో కోరారు. కొవాగ్జిన్ రిపోర్టుపై వివరణను కూడా పబ్లిష్ చేయాలని ఐసీఎంఆర్ ఆ జర్నల్ను కోరింది.
లాంగ్ టర్మ్ సేఫ్ట్ అనాలసిస్ ఆఫ్ ద బీబీవీ152 కరోనావైరస్ వ్యాక్సిన్ అనే పరిశోధన పత్రంపై విమర్శలు వచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్న ఏడాది లోపు మధ్యవయస్కులు, పెద్దలపై ఎటువంటి ఎఫెక్ట్స్ చూపించాయని స్టడీలో తేల్చారు. కొవాగ్జిన్ టీకా తీసుకున్న 926 మందిలో.. మూడవ వంతు ప్రజల్లో సెడ్ ఎఫెక్ట్స్ నమోదు అయినట్లు బీహెచ్‌యూ తన స్టడీలో పేర్కొన్నది.