డీఏ బకాయిల సొమ్ములు వేసినట్లే వేసి… మళ్లీ లాక్కున్న వైనంపై ఉద్యోగులు భగ్గుమన్నారు. సుమారు 90వేల మంది ఉద్యోగులకు చెందిన రూ.800 కోట్లు వారి జీపీఎఫ్ ఖాతాల నుంచి మాయమైపోయాయి. ఇది… ఇప్పటిదాకా బయటపడిన లెక్క. ఇంకా ఎన్ని లక్షల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు పోయాయో తెలియదు. దీంతో… అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఉద్యోగ సంఘా ల నేతలు బుధవారం సచివాలయానికి క్యూ కట్టారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార్‌రావు, ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒకరి వెంట మరొకరు సచివాలయానికి వచ్చారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, కార్యదర్శి సత్యనారాయణలతో భేటీ అయ్యారు. ‘‘జీపీఎఫ్ ఖాతాల్లో వారి అనుమతి లేకుండా సొమ్ము మాయం చేయడంపై ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
డీఏ ఎరియర్స్‌కు సంబంధించిన డబ్బులు క్రెడిట్ అయి మళ్లీ డెబిట్ అయ్యాయి. ఇదెలా జరిగిందో చెప్పండి. స్పష్టమైన సమాచారం ఇవ్వండి. మేం ఉద్యోగులకు సమాధానం చెప్పాల్సి ఉంది’’ అని తెలిపారు. తమ ఖాతాల్లోని సొమ్మును అనుమతి లేకుండా తీయడమంటే… అనధికారికంగా హ్యాకింగ్ చేసినట్లే అని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే… ఉద్యోగ సంఘాల నేతల ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ‘‘సాంకేతికంగా ఏం జరిగిందో తెలియదు. తెలుసుకుంటాం! పూర్తి సమాచారం తెప్పించుకుంటాం’’ అని అస్పష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. తమ జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి లాక్కున్న సొమ్ము తక్షణం జమ చేయకపోతే… ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
ఏజీతోనూ భేటీ…
జీపీఎఫ్ ఖాతాలో సొమ్ము మాయం అంశంపై అకౌంటింగ్ జనరల్‌ను(ఏజీ) కూడా ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. మార్చిలో నగదు విత్‌డ్రా చేసినా… తమకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏజీ కార్యాలయం నుంచి కూడా స్పష్టత రాలేదు. ‘‘మా ఖాతాల్లో నగదు మాయమైంది. ఏం జరిగిందో ఎవరూ చెప్పడంలేదు. దీనిపై విచారణ చేయాలి’’ అని ఉద్యోగ సంఘాల నేతలు ఏజీని కోరారు. దీనిపై ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తామని ఉద్యోగ సంఘాలకు ఏజీ తెలిపినట్లు తెలిసింది. ‘‘ఇలా ఎట్టిపరిస్థితుల్లో జరగకూడదు. గతంలో కూడా ఇలాగే డబ్బులు విత్‌డ్రా చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ఇప్పుడు మళ్లీ లేఖ రాస్తాం’’ అని చెప్పినట్లు సమాచారం. మరోవైపు… పీఆర్సీని సవాలు చేస్తూ ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేత వీవీ కృష్ణయ్య… కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా తన జీఫీఎఫ్ ఖాతా నుంచి తనకు తెలియకుండా సొమ్ము మాయమైందంటూ మరోసారి కోర్టు తలుపు తట్టారు.
మీ డబ్బులూ తీసేశారా!
పలు శాఖలు, విభాగాల నుంచి సొమ్ములు లాక్కున్న సర్కారు… ఇప్పుడు ఉద్యోగులు జీపీఎ్‌ఫలో దాచుకున్న సొమ్ములూ తీసుకోవడంపై సామాన్యుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ‘‘ఇదెలా సాధ్యమవుతుంది? మీ ఎకౌంట్లో డబ్బులు మీకు తెలియకుండా తీసేయొచ్చా?’’ అని ఉద్యోగులను అడుగుతూ, వారిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు… జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తమ సంఘాల నేతలకు ఫోన్లు, వాట్సాప్ ద్వారా తమ ఖాతాల్లో ఎంత సొమ్ము పోయిందో సమాచారం పంపిస్తున్నారు. ఉద్యోగుల్లో మూకుమ్మడిగా ఆందోళన వ్యక్తం అవుతుండడంతో నేతలపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయా సంఘాల నేతలు బుధవారం ఉదయాన్నే సచివాలయానికి చేరుకుని… ఆర్థికశాఖ ఉన్నతాధికారులను కలిశారు.
ప్రభుత్వంపై నమ్మకం పోతుంది!
‘‘ఉద్యోగులకు తెలియకుండానే వారి జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లను తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇటువంటి సంఘటనలతో ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకం తుడిచిపెట్టుకుపోతుంది. దీనిపై ఏజీ అధికారులకు ఫిర్యాదు చేశాం. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిని కూడా కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశాం. కానీ… వారు ఇదేం పెద్ద విషయం కాదన్నట్లు మాట్లాడారు. వారి సమాధానం సంతృప్తికరంగా లేదు. ఆర్థికశాఖ అధికారులు అబద్ధాలతో మాయ చేస్తున్నారు. గురువారం సీఎ్‌సను కలిసి… శుక్రవారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తాం. మా ఖాతాల్లో తిరిగి డబ్బు జమ చేసినంత మాత్రాన… తప్పు ఒప్పు కాదు. మమ్మల్ని తప్పుదోవ పట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. మా అనుమతి లేకుండా డీఏ సొమ్ము మార్చిలో డెబిట్ చేశారు. ఇంత వరకు క్రెడిట్ కాలేదు. ఇది క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అంశం. సీఎ్‌ఫఎంఎస్ రాజ్యాంగ విరుద్ధమని భావిస్తున్నాం! సీఎ్‌ఫఎంఎ్‌సలో ఉండి ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? జీపీఎఫ్ ఖాతా అంటే బ్యాంకు సేవింగ్స్ ఖాతాతో సమానం. మా ఖాతా నుంచి డబ్బులు తీసుకునే అధికారం ఎక్కడిది? దీనిపై సీఎ్‌ఫఎంఎస్ అధికారులకు ఏమైనా అధికారం కట్టబెట్టారా అని అడగ్గా, అటువంటి ఉత్తర్వులు ఏమీ జారీ చేయలేదని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. దీనిపై న్యాయనిపుణులను కూడా సంప్రదిస్తున్నాం. వారి సూచనల మేరకు ముందుకు వెళతాం!’’