ప్రతిరోజూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు
ప్రజాస్వామ్యానికి కట్టుబడి పని చేస్తున్న ఆజం
ఆజం ఖాన్ అంటే భాజపాకు కళ్లుమంట: అఖిలేశ్
లఖ్‌నవూ,అక్టోబరు 30(ఆంధ్రపత్రిక): సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్ అంటే భాజపా నేతలకు కళ్లుమంట అని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని వేధిస్తున్నారని విమర్శించారు. ఖాన్‌పై అనర్హత వేటు వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘’ఆజం ఖాన్‌ను భాజపా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ప్రతిరోజూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. మతోన్మాద శక్తులకు దీటైన ప్రత్యర్థిగా, ప్రజాస్వామ్యానికి కట్టుబడి పని చేస్తున్న ఆజం.. భాజపా నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అందుకే కాషాయదళం ఆయన్ని లక్ష్యంగా చేసుకొని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది’’ అని అఖిలేశ్ అన్నారు. ఆయన రాజ్యాంగం, లౌకికవాదం కోసం పోరాడిన నాయకుడని కితాబిచ్చారు.
విద్వేష ప్రసంగాల కేసులో కోర్టు ఆజం ఖాన్‌ను గురువారం దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్ష విధించిన మర్నాడే అతడిపై అనర్హత వేటు వేస్తూ ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌పుర్ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు అందులో పేర్కొంది. 2019లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో రామ్‌పుర్‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ప్రజాప్రతినిధి అయినా రెండేళ్లు లేదా అంతకు మించి జైలు శిక్షకు గురైతే పదవిని కోల్పోతారు. ఈ నేపథ్యంలోనే ఆజం ఖాన్‌పై అనర్హత వేటు పడిరది. 10 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆజం ఖాన్‌పై 90కి పైగా కేసులున్నాయి. ఓ చీటింగ్ కేసులో అరెస్టయి దాదాపు రెండేళ్ల పాటు జైలులో గడిపిన ఆయనకు సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.