బంగాళాఖాతంలో ఉన్న మైచౌంగ్ తుఫాను (Cyclone Michaung).. ఏపీ వైపు వేగంగా వస్తోంది. ఇది మంగళవారం ఉదయం ఉదయం 11.30కి ఒంగోలు, గుంటూరు దగ్గర.. రేపల్లెలో తీరం దాటేలా అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం తుఫాను వల్ల సుడిగాలుల వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది. ఈ తుఫాను దృష్ట్యా.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు డిసెంబర్ 4న సెలవు ప్రకటించారు విశాఖ జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున. విద్యార్థుల రక్షణ దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. డిసెంబర్ 04న సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నామనీ ఈ సమాచారాన్ని అన్ని యాజమాన్యాలకూ తక్షణ ఆదేశాల రూపంలో జారీ చేయాలని డి.ఈ.ఓ.కి ఆదేశాలు ఇచ్చారు.
రేపు సెలవు ఇవ్వాలా వద్దా అనేది.. రేపటి పరిస్థితిని గమనించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామనీ.. భవిష్యత్తు సెలవుల ప్రకటన తర్వాత ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా విద్యా శాఖ అధికారి.
తుఫాను.. మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఇది ప్రస్తుతం నెల్లూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని కారణంగా కోస్తా తీర ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇవాళ, రేపు ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది.
తుఫాను కారణంగా ఇప్పటికే 140కి పైగా రైళ్లను రద్దు చేశారు. అలాగే ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసింది. లోతు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. హుదూద్ తుఫాన్‌ని మించి గాలులు వీచే అవకాశం ఉండొచ్చని అధికారులు తెలిపారు.
తుఫాను కారణంగా ఇవాళ (సోమవారం), రేపు.. కోస్తా ఆంధ్ర, యానాంలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు కురుస్తాయి. అలాగే డిసెంబర్ 6న ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఈ తుఫాను ప్రభావం ఇవాళ రాయలసీమపై ఎలా ఉంటుందంటే.. ఈ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వాన చాలా చోట్ల పడుతుంది. అలాగే.. కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 5న కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు తగ్గుతాయని IMD చెప్పింది.