మచిలీపట్నం నవంబర్ 21 ఆంధ్రపత్రిక:
కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్నా పనులు మరింత వేగవంతం కావాలని,ఇప్పటివరకు 25 శాతం మాత్రమే బ్యూటిఫికేషన్ పనులు జరిగాయని వచ్చేవారం నూటికి నూరు శాతం పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఆయన ఛాంబర్ లో వివిధ శాఖల అధికారులు, ప్రణాళిక ఆర్కిటెక్చర్ బృందంతో సమావేశమై కలెక్టరేట్, కలెక్టర్ బంగ్లా, మంగినపూడి బీచ్ ల అభివృద్ధిపై విస్తృతంగా సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టరేట్, కలెక్టర్ బంగ్లా తో పాటు మంగినపూడి బీచ్ లను సుందరంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కలెక్టరేట్లోని ఈవిఎం గోడౌన్లు డిఆర్డిఏ కార్యాలయాల వద్ద స్లోప్ ఎలివేషన్ పనులు మందగించడంపై ఆరా తీశారు. మట్టితో మెరక చేయడానికి ఎంత సమయం పడుతుందని డ్వామా పిడి జీవి సూర్యనారాయణ కలెక్టర్ ప్రశ్నించారు. మరో రెండు వారాల వ్యవధిలో కలెక్టరేట్లో మెరక పనులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. ఈవీఎం గోదామును ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి మధ్యలో హై మాస్ట్ విద్యుత్ దీపాన్ని సైతం ఏర్పాటు చేయాలన్నారు. ఆ తర్వాత జంగిల్ క్లియరెన్స్, అప్రోచ్ రోడ్లు విషయమై అడిగారు. జంగిల్ క్లియరెన్స్ కాకుండా ఫిల్లింగ్ పనులు సాధ్యం కాదని, ఆలస్యానికి గల కారణాలను మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రయ్యను కలెక్టర్ పి. రాజాబాబు ప్రశ్నించారు. అగ్నిమాపక శాఖ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వరకు రోడ్డు కిరువైపులా అడ్డంగా పెరిగి ఎండిపోయిన చెట్ల కొమ్మలను కత్తిరించాలని, హార్టికల్చర్ అధికారులతో సమన్వయం చేసుకొని వారు ఎరుపురంగుతో ఇంటూ గుర్తు సూచించిన మొక్కల కొమ్మలను మాత్రమే తొలగించాలన్నారు. సుందరీకరణ పనుల్లో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని దట్టమైన పచ్చదనంతో ఏ రకమైన మొక్కలను ఎక్కడ నాటాలి మొక్కల సైజులను హార్టికల్చర్ అధికారులతో చర్చించి త్వరలో ఆ పనులు మొదలు పెడతామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ కు వచ్చే ముఖ్యమైన రహదారి పక్కన చక్కని పూల మొక్కలతో ప్లాంటేషన్ నిర్వహించాలని ప్రతి కార్యాలయానికి రోడ్డు ఇవ్వాలని, ప్రధానమైన రోడ్డుకిరువైపులా ఆర్డీవో కార్యాలయం వరకు ఎటువంటి పార్కింగ్, రోడ్డు పక్కన ఎటువంటి వాహనాలు నిలిపి ఉండరాదన్నారు. ఒకవైపున వాహనాల పార్కింగ్ సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ట్రెజరీ కార్యాలయం వద్ద ప్రహరీ గోడ లేని రెండు గేట్లను తొలగించాలన్నారు. కలెక్టరేట్ చుట్టూ కూడా ప్రకృతి రమణీయంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
కలెక్టరేట్ ప్రహరీ వెంబడి మురుగునీటి వ్యవస్థను సరి చేయాలన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ ఆవరణలో రోడ్లను సైతం మూసివేసేలా చెట్లు పెరిగి పోయాయని వారే స్వయంగా ఆ ప్రాంతాన్ని బాగు చేసుకునేలా జడ్పీ సీఈఓకు తెలియజేయాలని సూచించారు. సబ్ రోడ్ల తర్వాత భవనం చుట్టూ అంచులపై తెల్లని కాబూల్ స్టోన్స్ తో నిపుణునితో తాపడం చేయించాలన్నారు. ప్రధాన ద్వారం నుంచి కలెక్టరేట్ కు వచ్చే దారిలో ట్రయాంగిల్ ప్రదేశంలో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటుచేసి అక్కడ ఫోకస్ లాంప్స్ ను అమర్చునన్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో రోడ్డు పక్కన ఉన్న చెట్ల కింద కూర్చోవడానికి ఎప్పుడో నిర్మించిన అరుగులు పెద్ద పెద్ద నెర్రులతో బీటలు వారి పగిలిపోయేయని. హార్టికల్చర్ అధికారుల పర్యవేక్షణలో చెట్లకు ఏమాత్రం నష్టం కలక్కుండా ఆ అరుగులు తొలగించాలని తరువాత గ్రానైట్ స్టోన్ తో కూడిన ఆరుగులను అదే స్థానాలు నిర్మిస్తామని కలెక్టర్ చెప్పారు. రాత్రి వేళ గస్తీ నిమిత్తం సెక్యూరిటీని ఏర్పాటు చేయమని ఆ విషయం ఏమైందని డిఆర్ఓ పెద్ది రోజాను కలెక్టర్ ప్రశ్నించారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తానని ఆమె జవాబు చెప్పారు. తాను సూచించిన డిజైన్ ఎలక్ట్రిక్ పోల్స్ విషయమై విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. కలెక్టరేట్ లో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ తో అనుసంధించాలన్నారు. గార్డెన్ లైటింగ్ విషయంలో తాను సూచించిన విషయాలను పరిగణలో తీసుకోవాలన్నారు. సాయంత్రం వేళకు క్యాంపస్ అంతా మైల్డ్ లైటింగ్ తో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలన్నారు.
మంగినపూడి బీచ్ యావత్ కృష్ణా జిల్లా ప్రజలకు మాత్రమే కాక రాష్ట్రవ్యాప్తంగా, పొరుగు రాష్ట్రానికి దగ్గరగా ఉండే ఒక ముఖ్యమైన బీచ్ అని అన్నారు. పర్యాటక కేంద్రంగా ఈ బీచ్ ను ఎంతో అభివృద్ధిపరచాలని . బీచ్ కు వెళ్లే ప్రధాన కూడలి వద్ద హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించానని ఆ విషయం ఏమైందని జిల్లా పర్యటక శాఖ జనరల్ మేనేజర్ జి. రామ్ లక్ష్మణ్ ను కలెక్టర్ అడిగారు మంగినపూడి బీచ్ సమీపంలో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లను తొలగించి పిచ్చి మొక్కలు మొలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు, ఫోకస్ విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను హై మాస్ట్ విద్యుత్ దీపాన్ని ఏర్పాటు చేయాలన్నారు.అక్కడికి వచ్చిన పర్యాటకులకోసం భద్రత సిబ్బందిని, వారికోసం గదిని ఏర్పాటు చేయాలన్నారు.
తన క్యాంపు కార్యాలయమైన కలెక్టరేట్ బంగ్లా 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికి జనవరి 26వ తేదీన తాను ముఖ్య అతిథులకు హై టీ కార్యక్రమం ఏర్పాటు చేసుకునేందుకు తగిన విధంగా లేదన్నారు. చక్కగా పూల మొక్కలు పెరిగేందుకు అనువైన మట్టిని ఒక అడుగు మేరకు ఎత్తు చేసి చక్కని ప్లాంటేషన్ అభివృద్ధి పరచాలని హార్టికల్చర్ శాఖ అధికారులకు కలెక్టర్ పి రాజాబాబు సూచించారు.బంగ్లాలో భవనం పది అడుగుల చుట్టూ ప్రకృతి రమణీయంగా సుందర ఆకృతులతో తీర్చిదిద్దాలన్నారు.
బంగ్లా లోపలికి ప్రవేశించే రెండు మార్గాలను సి సి రహదారులుగా ఏర్పాటు చేయాలని, రహదారుల వెంబడి బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు.భవనం ముందర మంచి పూల తోటను అభివృద్ధి పరచాలని, ప్రధాన భవనం సుందరంగా కనపడే విధంగా భవనం పక్కనే ఫోకస్ దీపాలు ఏర్పాటు చేయాలని, నడక కోసం వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.
బంగళాలో అక్కడక్కడ నీరు నిల్వ ఉండకుండా అంతా ఒక చోటికి చేరే విధంగా మార్గం ఏర్పాటు చేయాలన్నారు.
వచ్చేవారం తాను స్వయంగా కలెక్టరేట్ సుందరీకరణ పనులు పరిశీలిస్తానని పురోగతి లేని సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పి. రాజాబాబు హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పెద్ది రోజా, మచిలీపట్నం ఆర్డిఓ ఎం. వాణి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జివి సూర్యనారాయణ, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి రాధిక, ప్రణాళిక వాస్తు కళా విద్యాలయం, విజయవాడ సహాయ ఆచార్యులు డి శ్రీనివాస్, సిహెచ్ కార్తీక్, జి షణ్ముఖ ప్రియ, ప్రాజెక్ట్ మానిటరింగ్ పిడి కెవి రావు, జిల్లా పర్యాటకశాఖ మేనేజర్ జి.రామ్ లక్ష్మణ్, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ ఈఈలు శ్రీనివాస్, రమణరావు, ఉద్యాన అధికారి మానస తదితర అధికారులు పాల్గొన్నారు.