రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జల వనరులు శాఖ అధికారులను ఆదేశించారు.
నీటి వృధాను అరికట్టి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలని స్పష్టం చేశారు. కరవు పరిస్థితులను సైతం అధికమించేందుకు వీలుగా అన్ని రిజర్వాయర్లను, మైనర్ ఇరిగేషన్ చెరువులను నీటితో నింపాలన్నారు. జలవనరుల శాఖపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఉన్న నీటి లభ్యత, తదితర అంశాలపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ రిజర్వాయర్లు, ఇతర ప్రాజెక్టులకు ఎంత నీరు వచ్చి చేరింది, పూర్తి స్థాయిలో నిండక పోవడానికి గల కారణాలను క్షేత్ర స్థాయి నుండి విశ్లేషించుకోవాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా దెబ్బతిన్నడయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్నిరెండు సీజన్లలో పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై కేంద్రంతో తాను కూడా మాట్లాడతానని, అధికారులు కూడా ఢిల్లీ వెళ్ళి సంబంధిత అధికారులతో మాట్లాడాలని ఆదేశించారు. వెలుగొండ, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
గోదావరి-పెన్నా, వంశధార-నాగావళి నదుల అనుసంధాన ప్రకియను ముందుకు తీసుకువెళ్ళాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో భవిష్యత్తులో నీటి ఎద్దడిని సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు. గోదావరి డెల్టా కంటే ముందుగా కృష్ణా డెల్టాలో వ్యవసాయ పనులు మొదలయ్యే విధంగా పూర్తి స్థాయిలో నీటిని అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. పులిచింతల నీటిని అవసరాలకు వాడుకునేలా నీటి నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు రిజర్వాయర్ ను పూర్తిగా నింపాలని స్పష్టం చేశారు.
వర్షపాతం వివరాలను విశ్లేషించి ఒక కార్యాచరణతో ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మైక్రో, మ్యాక్రో స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసి నీటి వినియోగంలో పటిష్టమైన పాలసీని తీసుకురావాలని సూచించారు. దీనిలో సామాజిక వేత్తలు, విద్యార్ధులు, సాగునీటి నిపుణులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. నీరు సులభంగా పారేందుకు కాలువలు, డ్రైన్లలో గల తూడు, గుర్రపు డెక్క వంటివి తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, రిజర్వాయర్ల పరిస్థితులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సియంకు వివరించారు. ఇప్పటి వరకూ 64 శాతం రిజర్వాయర్లను నీటితో నింపినట్టు సీఎంకు వివరించారు. ఈసమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, సియం కార్యదర్శి ఎవి.రాజమౌళి, జల వనరుల శాఖ సలహాదారు, అధికారులు వెంకటేశ్వరరావు, లక్ష్మీ ప్రసాద్, సిఇలు, ఎస్ఇలు,ఈఈలు, తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.