నిర్మల్ జిల్లావాసులకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు.
నిర్మల్ జిల్లాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) వరాల జల్లు కురిపించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా నూతన కలెక్టరేట్‌ను నిర్మాణం చేసుకున్నామన్నారు. కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా రూ.10లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాల్టీలకు రూ.25కోట్లు చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు ప్రతి మండల కేంద్రానికి రూ.20లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అదే విధంగా నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున ప్రకటిస్తున్నామన్నారు.
ఇటీవల విడుదలై పదో తరగతి ఫలితాల్లో మొత్తం తెలంగాణలోనే నిర్మల్ జిల్లా నంబర్ వన్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నిర్మల్ జిల్లా టీచర్లను, విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని అన్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటిచారు.
రాబోయే రోజుల్లో పునాది రాయి కోసం రాబోతున్నాం. అద్భుత ఆలయం నిర్మించుకుందాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాన్నారు. “మావా తండా మావా రాజ్” సాకారమైందన్నారు.
నిర్మల్ జిల్లాకు కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు వచ్చామన్నారు సీఎం కేసీఆర్. మన ప్రభుత్వం ప్రారంభించినటువంటి పేదల కోసం నిర్మించే 2 వేల డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకస్థాపనం చేశామన్నారు. పేదవాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.